కరోనా దెబ్బకు భారత పురుషుల హాకీ జట్టు కుదేలైంది. ఇప్పటికే కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లకు వైరస్ సోకగా.. తాజాగా ఫార్వర్డ్ క్రీడాకారుడు మన్దీప్ సింగ్‌కు పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ప్రకటించింది భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్).
ఆక్సిజన్ తగ్గడంతో ఆసుపత్రిలో...
నెల రోజుల విరామం తర్వాత తిరిగి జాతీయ శిక్షణ శిబిరం కోసం బెంగళూరులోని సాయ్ కేంద్రానికి వచ్చిన హాకీ ఆటగాళ్లందరికీ వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న ఆ శిబిరం ఆరంభం కావాల్సి ఉంది. అయితే పరీక్షల్లో మన్దీప్నకు పాజిటివ్‌గా నిర్దరణ అయింది. తొలుత వైరస్ లక్షణాలు లేకపోవడం మిగతా అయిదుగురు ఆటగాళ్లతో పాటు అతనికీ తమ ప్రాంగణంలోనే చికిత్స అందిస్తున్నట్లు సాయ్ తెలిపింది.
అయితే తర్వాత ఈ ఫార్వర్డ్ ప్లేయర్‌కు ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వివిధ ప్రదేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన ఆటగాళ్లు.. ప్రయాణం సమయంలోనే వైరస్ ఉన్న వ్యక్తులతో కాంటాక్ట్ అయి ఉంటారని సాయ్ అధికారులు భావిస్తున్నారు.
భారత్ తరఫున 129 గేమ్‌లు ఆడిన మన్దీప్.. 60 గోల్స్ సాధించాడు. 2018 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యుడు. ఇతడితో పాటు మన్‌ప్రీత్ సింగ్, సురేందర్, జస్కరన్, వరుణ్ కుమార్, కృష్ణన్ వైరస్ బారిన పడ్డారు.