అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌ని ప్రకటించింది. భారత ఫుట్‌బాల్ జట్టు రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 101వ స్థానంలో నిలిచింది. గురువారం ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో భారత్ 1,219 పాయింట్లు సాధించింది. ఆసియా ఖండంలో చూసుకుంటే 18వ స్థానంలో ఉంది.
1,737 పాయింట్లతో బెల్జియం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫిఫా-2018 ప్రపంచకప్ విజేత ఫ్రాన్స్ 1,734 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్ (1,676), ఇంగ్లండ్(1,647), క్రొయేషియా(1,621) పాయింట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఆసియా నుంచి ఇరాన్ ఉత్తమంగా 21వ స్థానంలో ఉంది. అనంతరం జపాన్(26), దక్షిణకొరియా(37), ఆస్ట్రేలియా(41), ఖతార్(55) స్థానాలతో భారత్ కంటే ముందున్నాయి. ఫిబ్రవరి 7న ఫిఫా ర్యాంకింగ్స్ ప్రకటించినప్పటి నుంచి భారత ఫుట్‌బాల్ జట్టు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.