Yash Dhull: వెస్టిండీస్ నుంచి భారత్ చేరేందుకు మారిన విమానాలు నాలుగు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో సత్కారం. ఆపై దిల్లీలోని ఇంటికి.. అక్కడి నుంచి మళ్లీ గువాహటిలో ఉన్న రంజీ జట్టుతో చేరేందుకు ఇంకో మూడు విమానాలు. గత రెండు రోజులుగా అతనికి సరైన నిద్ర లేదు. అయినా రంజీ ట్రోఫీ కోసం జట్టుతో చేరి ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాడు. సీనియర్ జట్టులో చోటు కోసం వేగంగా అడుగులు వేస్తున్న ఆ కుర్రాడే అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ యశ్ ధుల్. మరో 18 నెలల్లోపు టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ 19 ఏళ్ల కుర్రాడు.. ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు అతని మాటల్లోనే..
కొన్ని రోజులుగా సరిగ్గా నిద్రపోలేదు. కానీ దాని గురించి ఎలాంటి బాధ లేదు. ఇప్పటివరకూ నేను చేయాల్సిన పని పూర్తయింది. ఇప్పుడిక సమీప భవిష్యత్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరో 18 నెలల్లోపు టీమ్‌ఇండియా తరపున ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దాన్ని అందుకోవడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఒకవేళ అనుకున్న సమయంలో అది నెరవేరకపోయినా.. దాన్ని చేరుకునేందుకు ఇంకా తీవ్రంగా ప్రయత్నిస్తా. రాబోయే రోజుల గురించి భయం లేదు. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తన కెరీర్ అనుభవాలను కోహ్లీ భాయ్ నాకు చెప్పాడు. ఈ దశ నుంచి నా కెరీర్ పట్ల ఎలాంటి దృక్పథంతో సాగాలనే దానిపై అవగాహన ఉంది. ఏ విషయాలపై దృష్టి పెట్టాలి, వేటిని పక్కనపెట్టాలి అనే దానిపై కోహ్లీతో మాట్లాడాక స్పష్టత వచ్చింది.
తొలిసారి రంజీ..: తొలిసారి రంజీ ట్రోఫీలో ఆడబోతున్నా. ఎర్రబంతి ఆట కోసం నా ఆలోచన సరళిని మార్చుకోవాల్సి ఉంది. దానికి సన్నాహకం విభిన్నంగా ఉంటుంది. కానీ తెల్లబంతి ఆట కంటే మరీ ఎక్కువ విరుద్ధంగా ఉంటుందని మాత్రం అనుకోవడం లేదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఎర్రబంతిని ఎదుర్కోవడం సులువే. అదంతా మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. శారీరకంగానూ ఫిట్‌గా ఉండాలి. నా అన్ని షాట్లపై దృష్టిపెట్టి ఉత్తమ ఆటగాడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తా. అండర్-19 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ తర్వాత కరోనా సోకి ఏడు రోజుల ఐసోలేషన్‌లో ఉండాల్సి రావడం వల్ల చిరాకు వచ్చింది. తొలి రెండు రోజులు కఠినంగా గడిచాయి. కానీ ఆ తర్వాత గదిలోనే ప్రాక్టీస్ మొదలెట్టా. మానసికంగా ఈ టోర్నీ కోసం కొన్నేళ్ల ముందు నుంచే సన్నద్ధమయ్యా. కాబట్టి ఒక్క వారం ప్రాక్టీస్ చేయనంత మాత్రాన ఆటను మర్చిపోలేం కదా. నా ఆట పట్ల విశ్వాసంతో ఉన్నా. ఆ దశలో జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ లక్ష్మణ్ సర్ మాటలు ప్రేరణగా నిలిచాయి.
ఇవీ చూడండి:
IPL 2022: ప్రపంచకప్ గెలిచినా వేలానికి అనర్హులే! ఎందుకంటే..?