Womens World cup 2022 Mithali Raj: మిథాలీ రాజ్.. ప్రపంచ మహిళల క్రికెట్లో ఓ దిగ్గజం. వర్ధమాన క్రికెటర్లకు ఆమె కెరీర్ ఆదర్శం! ఆమె ఎన్నో ఘనతలు.. మరెన్నో రికార్డులు సాధించింది. మహిళల క్రికెట్లో ఇంకెవరికీ సాధ్యంకాని ఉన్నత శిఖరాలు అధిరోహించిన మిథాలీకి ఉన్న ఒకే ఒక్క లోటు.. ప్రపంచకప్ టైటిల్. కెరీర్‌లో చివరి మజిలీకి చేరువైన మిథాలీ.. ఈనెల 4న న్యూజిలాండ్ వేదికగా ప్రారంభంకానున్న ప్రపంచకప్‌లో భారత్‌ను నడిపించనుంది. క్రికెటర్‌గా ఆమెకిది ఆరో ప్రపంచకప్.. కెప్టెన్‌గా నాలుగోది. బహుశా కెరీర్‌లో చివరి కప్ ఆడుతున్న మిథాలీ ఆ ఒక్క లోటును భర్తీ చేసుకుంటుందా..!
39 ఏళ్ల మిథాలీ జీవితంలో 30 సంవత్సరాలు క్రికెట్టే. తొమ్మిదేళ్ల వయసులో ఆటలో అడుగుపెట్టిన ఆమె ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ఈ మధ్యకాలంలో కొన్ని తరాలు మారిపోయాయి. ఆమెతో కలిసి ఆడిన పూర్ణిమారావు, అంజు జైన్, అంజుమ్ చోప్రాలు ఎప్పుడో ఆటకు వీడ్కోలు పలికారు. 2009లోపు మిథాలీ ఈడువాళ్లంతా రిటైరైపోయారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు జట్టులో ఉన్నవాళ్లంతా మిథాలీ జూనియర్లే. తనకంటే సీనియర్లకు సారథ్యం వహించిన మిథాలీ.. తన అనుభవమంత వయసులేని వాళ్లకు కెప్టెన్‌గా కొనసాగుతుంది. తనకంటే ఎంతో చిన్నవాళ్లు షెఫాలీవర్మ, రిచా ఘోష్ (17 ఏళ్లు)లతో కలిసి ఆడుతోంది. ఏమాత్రం తగ్గకుండా వారితో పోటీపడుతోంది. 1999లో వన్డేల్లో అరంగేట్రం చేసినప్పుడు మిథాలీకి 16 ఏళ్లు. సుమారు 24 సంవత్సరాల తర్వాత కూడా ఆమెలో అదే ఉత్సాహం.. ఆట పట్ల అదే అంకితభావం.. విజయం కోసం అదే తపన. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన 5 వన్డేల్లో మిథాలీ మూడు అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. భారత జట్టు తరఫున అత్యధిక స్కోరర్ ఆమెనే. రెండు జట్ల తరఫున అత్యధిక పరుగులు రాబట్టిన రెండో క్రికెటర్ మిథాలీనే. 24 ఏళ్లుగా ఒకే లయతో బ్యాటింగ్ చేయడం.. సుమారు 18 సంవత్సరాలుగా అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతుండటం ప్రపంచ క్రికెట్లోనే అరుదైన ఘట్టం.
భారత పురుషుల జట్టులో సచిన్ తర్వాత మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి దూసుకొచ్చారు. సచిన్ రికార్డులు అందుకోలేకపోయినా భారత క్రికెట్‌పై తమదైన ముద్ర వేశారు. అతని లోటు కనబడకుండా చేశారు. భవిష్యత్తులో మరికొందరు కూడా రావొచ్చు. కాని మహిళల క్రికెట్లో మిథాలీ లోటును భర్తీ చేయడం దాదాపు అసాధ్యమే! మిథాలీ మాదిరి సుదీర్ఘంగా కెరీర్ కొనసాగించడం.. ఆమె ఘనతలు, రికార్డుల్ని అందుకోవడం మరెవరికీ సాధ్యంకాకపోవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు (10,686) ఆమెదే. వన్డేల్లో 7000 పరుగులు మైలురాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీనే. టీమ్‌ఇండియా (పురుషులు, మహిళలు) తరఫున టీ20 క్రికెట్లో 2000 పరుగులు సాధించిన మొదటి క్రికెటర్ కూడా ఆమెనే. నాలుగేళ్ల క్రితమే మిథాలీ ఈ ఘనత అందుకుంది. సుమారు 30 ఏళ్లుగా ఫిట్‌నెస్ కాపాడుకుంటూ.. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా కెరీర్ కొనసాగిస్తున్న మిథాలీ రానున్న ప్రపంచకప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలకడం దాదాపుగా ఖాయమే! 2011 ప్రపంచకప్ ట్రోఫీతో తన కెరీర్‌ను సంపూర్ణం చేసుకున్న సచిన్ లాగే మిథాలీ కూడా వరల్డ్‌కప్‌తో ఆటకు ముగింపు పలకాలన్నది ప్రతి భారత క్రికెట్ అభిమాని ఆశ. ఇప్పటికే రెండు ప్రపంచకప్ (2005, 2017)లలో భారత్‌ను ఫైనల్ చేర్చిన మిథాలీ.. ఇప్పుడు ట్రోఫీతో కెరీర్‌ను సంపూర్ణం చేసుకోవాలని ఆశిస్తోంది..! ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్నది అందరి ఆకాంక్ష.
ఇదీ చూడండి: రష్యాకు భారీ దెబ్బ.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి బహిష్కరణ