టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(virat kohli) బ్యాటింగ్‌లో బలహీనతల్ని అధిగమించాలని మాజీ క్రికెటర్ లక్ష్మణ్(vvs laxman) సూచించాడు. "నాలుగో టెస్టు ప్రారంభానికి చాలా తక్కువ సమయం ఉంది. ఆ లోపు కోహ్లీ తన టెక్నిక్‌ను మార్చుకోవాలి. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, కోహ్లీ క్రీజులో కుదురుకున్న తీరుని బట్టి భారత్ రాణిస్తుందనుకున్నా. కానీ, కోహ్లీ మరోసారి అదే తప్పు చేశాడు. అతడికి దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి ఔటయ్యాడు. ఈ తప్పును వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి" అని అన్నాడు.
అలాగే, యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్(rishabh pant)ను స్వేచ్ఛగా ఆడనివ్వాలని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. "పంత్ తన సహజశైలికి విరుద్ధంగా.. రక్షణాత్మకంగా ఆడుతూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం అతడిపై ఒత్తిడి ఉండటం వల్ల స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. జట్టు యాజమాన్యం అతడితో మాట్లాడి స్వేచ్ఛగా ఆడేందుకు ప్రోత్సహిస్తే.. గొప్పగా రాణించగలడు. అది జట్టుకెంతో మేలు చేస్తుంది. భయం లేకుండా ఆడినప్పుడే పంత్ అత్యుత్తమ ప్రదర్శన చేయగలడు" అని పేర్కొన్నాడు.