Kohli 100 Test: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదని తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. దీంతో కోహ్లీ 100 టెస్టుల ఘనత కోసం అభిమానులు మరికొంత కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇప్పటివరకు కోహ్లీ 98 టెస్టులు ఆడాడు. జోహన్నస్బర్గ్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఇతడు ఆడితే అది 99వది అయ్యేది. ఇక సౌతాఫ్రికాతో జరగబోయే టెస్టు కోహ్లీ ఖాతాలో 100వ టెస్టు మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇక కోహ్లీ తన 100వ టెస్టు కోసం ఫిబ్రవరి వరకు ఎదురుచూడాల్సిందే. ఆ నెల 25 నుంచి శ్రీలంకతో తొలి టెస్టు ఆడనుంది టీమ్ఇండియా. ఆ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగనుంది. దీంతో కోహ్లీకి ఇది 100వ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.
కోహ్లీ, డివిలియర్స్ ఒకేలా!
చాలాకాలంగా ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నారు విరాట్ కోహ్లీ, డివిలియర్స్, ఇన్నేళ్లు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ ఈ ఏడాది ఆ బాధ్యతలకు గుడ్‌బై చెప్పాడు. అయితే వీరిద్దరూ బెంగళూరు చిన్నస్వామి మైదానాన్ని సొంత మైదానంగా చూస్తారు. డివిలియర్స్ కూడా ఇదే మైదానంలో 2015లో తన 100వ మ్యాచ్ ఆడాడు. ఇక కోహ్లీ కూడా ఇక్కడే తన కెరీర్లో 100వ టెస్టును ఆడబోతుండటం విశేషం.