విరాట్ కోహ్లి తన అభిమానులకు మరోసారి షాకిచ్చాడు. టీ20 ప్రపంచకప్ వరకే భారత టీ20 జట్టుకు సారథిగా ఉంటానని చెప్పిన ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్‌లోనూ (IPL) కెప్టెన్ ఇన్నింగ్స్ ముగించాలని నిర్ణయించుకున్నాడు. నాయకుడిగా ఈ సీజనే తనకు ఆఖరిదని ఆదివారం ప్రకటించాడు. క్రికెటర్‌గా తన కెరీర్ ముగిసే వరకు బెంగళూరు జట్టుతో (kohli rcb) కొనసాగుతానని చెప్పాడు.
"ఆర్‌సీబీ కెప్టెన్‌గా (kohli rcb captaincy) ఇదే నా చివరి ఐపీఎల్. ఇది తేలికైన నిర్ణయం కాదు. కానీ.. ఫ్రాంఛైజీ ప్రయోజనాల దృష్ట్యా సరైందని భావిస్తున్నా. నాపై నమ్మకం ఉంచిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. ఇది చిన్న మజిలీ మాత్రమే. ప్రయాణం ముగిసినట్లు కాదు. నా చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు బెంగళూరు జట్టుకే ఆడతాను. మరే జట్టులోనూ నన్ను ఊహించుకోలేనని యాజమాన్యానికీ స్పష్టం చేశా. టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఐపీఎల్‌లోనూ సారథ్య బాధ్యతలకు దూరం కావాలని ఆలోచిస్తున్నా. ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం.. గొప్ప, స్ఫూర్తిదాయక ప్రయాణం. ఈ అవకాశం కల్పించిన మేనేజ్‌మెంట్‌కు, నా ప్రయాణంలో భాగమైన కోచ్‌లు, ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు"
- విరాట్ కోహ్లీ
కోహ్లీ.. ఐపీఎల్ ఆరంభం (2008) నుంచి బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. 2013లో డానియల్ వెటోరి నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అతడి కెప్టెన్సీలో 2016లో ఫైనల్ చేరడమే బెంగళూరుకు అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్లో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన (virat kohli ipl captain record) కూడా 2016లోనే నమోదైంది. 81 సగటుతో ఆ ఏడాది 640 పరుగులు చేసి, ఆరెంజ్ సొంతం చేసుకున్నాడు.
బెంగళూరు తరఫున కోహ్లీ ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడాడు. 5 సెంచరీలు సహా 6076 పరుగులు చేశాడు. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ అతడి ఐపీఎల్ కెరీర్లో 200వ మ్యాచ్.
విరాట్ గొప్ప ఆస్తి..
కోహ్లీ బెంగళూరు జట్టుకు గొప్ప ఆస్తి అని, అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆ ఫ్రాంఛైజీ ఛైర్మన్ ప్రథమేశ్ మిశ్రా చెప్పాడు. కోహ్లీ అత్యుత్తమ నాయకుడని కొనియాడాడు. విరాట్ సేవలకు కృతజ్ఞతలు తెలిపిన మిశ్రా.. సారథిగా అతడికి ఘన వీడ్కోలు ఇచ్చేందుకు జట్టు దృఢసంకల్పంతో ఉందన్నాడు.
ఇదీ చూడండి: IPL 2021: తగ్గేదేలే.. అప్పటిలానే ఆడతాం: కోహ్లీ