Virat Kohli Hits century : ఎట్టకేలకు కోహ్లీ సాధించాడు. దాదాపు మూడేళ్లు (1000 రోజులకుపైగా) వేచిచూసిన రోజు రానే వచ్చింది. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టేశాడు. అవును ఇది నిజమే. విరాట్ మళ్లీ వంద కొట్టాడు. అంతర్జాతీయ కెరీర్లో 71వ సారి వంద బాదాడు. ఆసియా కప్‌లో భారత ఆఖరి టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై వీరవిహారం చేసిన కోహ్లీ 53 బంతుల్లోనే 100 మార్కును అందుకున్నాడు. మొత్తంగా 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీకి అంతర్జాతీయ టీ20ల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. రాహుల్(62; 41 బంతుల్లో) కూడా అర్ధసెంచరీతో రాణించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 రన్స్ చేసింది. రెండు వికెట్లూ ఫరీద్ అహ్మద్‌కే దక్కాయి.
విరాట్ చివరిసారి బంగ్లాదేశ్‌తో టెస్టులో సెంచరీ చేశాడు. అది 2019 నవంబర్ 22న. అంటే సరిగ్గా 1019 రోజులైంది. అప్పటినుంచి విరాట్ ఎన్నో సార్లు 90ల్లోకి వచ్చినా.. శతక ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పుడు ఆసియా కప్‌లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కోహ్లీ.. చివరిమ్యాచ్‌లో అఫ్గాన్‌పై సెంచరీ చేశాడు. అభిమానుల ఆకాంక్ష తీర్చాడు. ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఈ సెంచరీని తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు.
రికార్డులే రికార్డులు..
- విరాట్ కోహ్లీకి టీ20ల్లో ఇదే(122) అత్యధిక వ్యక్తిగత స్కోరు.
- ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5 శతకాలు బాదిన విరాట్‌కు అంతర్జాతీయ టీ-20ల్లో ఇదే తొలి సెంచరీ.
- 2016 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున చేసిన 113 (50 బంతుల్లో) ఇప్పటివరకు విరాట్ అత్యుత్తమ స్కోరుగా ఉండేది. ఆ ఐపీఎల్లో విరాట్ 4 సెంచరీలు బాదడం విశేషం.
- అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాళ్లలో కోహ్లీ టాప్‌లో నిలిచాడు. కోహ్లీ ఇప్పుడు 122 రన్స్ చేయగా.. రోహిత్(118), సూర్యకుమార్ యాదవ్(117) వరుసగా 2,3 స్థానాల్లో నిలిచారు.
- అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, వన్డే, టీ-20ల్లో సెంచరీ నాలుగో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ. అంతకుముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 3 ఫార్మాట్లలో సెంచరీలు బాదారు.
- అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండో స్థానానికి చేరాడు. ఆసీస్ దిగ్గజం పాంటింగ్‌తో కలిసి 71 సెంచరీలతో స్థానాన్ని పంచుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ 100 శతకాలతో అగ్రభాగాన ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో విరాట్ దరిదాపుల్లోనూ ఎవరూ లేకపోవడం విశేషం.
- విరాట్ అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సులు కొట్టి.. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా పదో క్రికెటర్. కివీస్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 172 సిక్సులతో టాప్‌లో ఉండగా.. భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (171) సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 104 సిక్సులతో 9వ స్థానంలో నిలిచాడు.
- టీ20 ఇంటర్నేషనల్స్‌లో 3500 పరుగుల మార్కు దాటిన రెండో క్రికెటర్ విరాట్ కోహ్లీ. రోహిత్ 3,620 పరుగులతో టాప్‌లో ఉండగా.. విరాట్ 3,584 రన్స్ చేశాడు.
ఇవీ చూడండి : అఫ్ఘాన్ ప్లేయర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన పాక్ బ్యాటర్.. కుర్చీలు విసిరి ఫ్యాన్స్ విధ్వంసం!