టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ(virat kohli news) టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి కెప్టెన్‌గా తప్పుకోవడం సరైన నిర్ణయమేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్‌హాగ్(brad hogg on kohli) అన్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో కోహ్లీ కెప్టెన్సీపై స్పందించాడు. మూడు ఫార్మాట్లలో కోహ్లీ సారథ్యం వహిస్తున్నందున పనిభారం పెరిగిందని, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే.. బ్యాట్స్‌మన్‌గా రాణించడం తేలికవుతుందని మాజీ స్పిన్నర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని నేను భావిస్తున్నా. టీమ్‌ఇండియాకు మూడు విభాగాల్లో కెప్టెన్సీ చేయడం వల్ల అతడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. ఒకవేళ కోహ్లీ బాగా ఆడితే అంతా సవ్యంగా సాగుతుంది. అదే విఫలమైతే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాడు. ప్రతి ఒక్కరూ అతడిని తిట్టిపోస్తారు. అతడు ఒత్తిడిని తట్టుకొని ఆడుతున్నాడు. అయితే, చివరిసారి ప్రపంచకప్‌కు నాయకత్వం వహించి కోహ్లీ జట్టు విజయం సాధించి కప్పు అందుకునే ఒక అవకాశం ఉన్నందున సంతోషంగా ఉంది" అని హాగ్ పేర్కొన్నాడు.
కోహ్లీ గత ఐదు సిరీస్‌ల్లో రాణించలేకపోయాడని, ఈ విషయాన్ని అతడు కూడా అర్థం చేసుకున్నాడని ఆసీస్ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఐదో టెస్టు ఆడకపోవడంపై అందరూ విమర్శిస్తున్నారని, అయినా.. టీమ్‌ఇండియా సరైన నిర్ణయమే తీసుకుందని మద్దతిచ్చాడు. కోహ్లీసేన టెస్టు క్రికెట్‌కు విలువ ఇస్తున్నందునే ఈ ఫార్మాట్‌లో ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.