ఇటీవలి ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి.. అర్జెంటీనా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సితనదైన ఆట శైలితో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే.. మ్యాచ్ అనంతరం నిర్వహించిన విజయోత్సవాల్లో అతని ఎడమ కాలికి ఓ ఎరుపు రంగు రిబ్బన్ కనిపించింది. అదృష్టం, ఆత్మవిశ్వాసానికి గుర్తుగా భావించే మెస్సి రిబ్బన్ వెనుక ఓ ఆసక్తికర కథ దాగి ఉంది.
2018లో రష్యా వేదికగా ఫిఫా ప్రపంచకప్ నిర్వహించారు. ఈ పోటీల గ్రూప్ దశలో ఓటముల కారణంగా అర్జెంటీనా గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుపోయింది. ఆ సమయంలో అర్జెంటీనా జర్నలిస్ట్ రమ పంటారొట్టో.. మెస్సిని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడే మెస్సికి ఆయన ఓ రెడ్ రిబ్బన్ ఇచ్చారు. 'మా అమ్మ.. నాకంటే మిమ్మల్నే ఎక్కువగా ఇష్టపడుతుంది! ఆమె ఇచ్చిన ఈ రిబ్బన్‌ను అదృష్టంగా భావిస్తా. కావాలంటే మీకు ఇస్తా. మా అమ్మ కూడా ఇదే చెప్పింది. దీన్ని జాగ్రత్తగా ఉంచండి' అని చెప్పారు.
కొద్ది రోజులకే.. అదే ప్రపంచ కప్‌లో నైజీరియాపై అర్జెంటీనా విజయం సాధించింది. 2- 1 తేడాతో జట్టును మెస్సి గెలిపించాడు. మ్యాచ్ అనంతరం మెస్సిని.. జర్నలిస్ట్ పంటారొట్టో మరోసారి పలకరించారు. రిబ్బన్ విషయాన్ని గుర్తుచేశారు. దీంతో అప్పటికే ఆ రిబ్బన్‌ను ధరించిన మెస్సి ఆ జర్నలిస్టుకు చూపించాడు. దీంతో ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. 'నమ్మలేక పోతున్నా. దీన్ని నిజంగా ధరించారా..! అమ్మా.. చూడు మెస్సి ఈ రిబ్బన్ ధరించాడు' అంటూ సదరు జర్నలిస్టు పొంగిపోయారు.
తదనంతరం కూడా మెస్సి పలుమార్లు ఆ రిబ్బన్‌తో కనిపించాడు. మైదానంలోనే కాకుండా బయట సైతం రిబ్బన్‌ను ధరించేవాడు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకుగానూ.. ఫిలిప్ కౌటిన్హో, పాలో డైబలా, లాటరో మార్జినెజ్, రోడ్రిగో ది పాల్ తదితర ఆటగాళ్లకూ మెస్సి ఆ రిబ్బన్ ఇచ్చాడట. ఖతర్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌తో జరిగిన షూటౌట్ సమయంలో.. గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ కూడా రెడ్ రిబ్బన్‌ను ధరించాడు. కోమన్ పెనాల్టీ షాట్‌ను అడ్డుకొని అభిమానుల దృష్టిలో హీరోగా నిలిచాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో నిర్వహించిన వేడుకల సందర్భంగా.. మెస్సి ఎడమ కాలికి ఆ రిబ్బన్ కనిపించింది. దీంతో ఇది కాస్త మరోసారి వార్తల్లో నిలిచింది.