Gunathilaka Retirement: శ్రీలంక స్టార్ బ్యాటర్ దనుష్క గుణతిలక టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 30 ఏళ్ల ఈ క్రికెటర్ వన్డే, టీ20లపై దృష్టిసారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకు 8 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇతడు 299 పరుగులు సాధించాడు. 2018లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడాడు.
వన్డే, టీ20ల్లో మాత్రం గుణతిలక రికార్డు గొప్పగానే ఉంది. తన కెరీర్లో 44 వన్డేలు ఆడిన ఇతడు 36.19 సగటుతో 1520 పరుగులు చేశాడు. టీ20ల విషయానికి వస్తే 30 మ్యాచ్‌ల్లో 121.62 స్ట్రైక్ రేట్‌తో 568 పరుగులు సాధించాడు.
నిషేధం ఎత్తివేత
ధనుష్క గుణతిలకతో పాటు కుశాల్ మెండిస్, నీరోషన్ డిక్వెల్లాపై గతేడాది ఏడాది పాటు నిషేధాన్ని విధించింది లంక క్రికెట్ బోర్డు. శుక్రవారం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. వారు అన్ని ఫార్మాట్లలో ఆటను కొనసాగించొచ్చని పేర్కొంది. లంక ప్రీమియర్ లీగ్ ముగిసిన నేపథ్యంలో ముగ్గురు ఆటగాళ్ల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.