ICC Under-19 World Cup: యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చే అండర్-19 ప్రపంచకప్ పోటీలకు రంగం సిద్ధమవుతోంది. 2024 నుంచి 2027 మధ్య ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశాల జాబితాను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు రానున్న ఏడాది శ్రీలంక ఈ టోర్నీకి వేదిక కానుంది. జింబాబ్వే, నమీబియా, మలేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
2024 పురుషుల అండర్-19 ప్రపంచకప్‌నకు శ్రీలంక, 2026 కప్‌నకు జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పురుషుల విభాగానికి సంబంధించి 14 జట్లలో 10 జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆతిథ్య దేశాలు కావడంతో ముందుగానే ఈ జాబితాలో చేరాయి. ఆ సమయానికి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో ఉన్న జట్లకు సైతం చోటుదక్కనుంది. ఐసీసీ గ్లోబల్ క్వాలిఫయర్ సిరీస్ ఫలితాల ఆధారంగా మిగిలిన 4 జట్లు అర్హత సాధించనున్నాయి.
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2025 మహిళల టోర్నీ మలేసియా, థాయిలాండ్‌లో జరగనుంది. 2027లో బంగ్లాదేశ్, నేపాల్ దీనిని సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మహిళల విభాగంలో ప్రతి గ్రూపు నుంచి 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. 2023 టీ20 ప్రపంచకప్‌లో ఒక్కో గ్రూపు నుంచి టాప్ 3లో నిలిచిన జట్లు సహా ఆతిథ్య దేశమైన బంగ్లాదేశ్, 2023 ఫిబ్రవరి 27 టీ20 ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించిన దేశాల జట్లు ఇందులో ఉంటాయి.