శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన జాతీయ కాంట్రాక్టుపై సంతకం చేయమని తెగేసి చెప్పేశారు ఆ దేశ క్రికెటర్లు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ సంయుక్త ప్రకటనొ విడుదల చేశారు. బోర్డులో పారదర్శకత్వం లోపించిందని ఆరోపించారు. ఈ వివాదం పరిష్కారం కాకపోతే.. జూన్18-జులై 4వరకు జరగబోయే ఇంగ్లాండ్ సహా భవిష్యత్ పర్యటనలకు సంబంధించిన కాంట్రాక్టులపై సంతకం చేయమని స్పష్టం చేశారు. ఈ సంతకాలు చేయకపోవడమంటే దేశం తరఫున ఆడటానికి తాము నిరాకరించినట్లు కాదని చెప్పారు.
మొత్తం 24 మంది ప్లేయర్లను నాలుగు కేటగిరీలుగా విడగొట్టారు. ఏ-కేటగిరీలో ఆరుగురు క్రికెటర్లను చేర్చారు. వీరికి ఏడాదికి రూ.51 లక్షల నుంచి దాదాపు రూ.73 లక్షలుగా నిర్ణయించారు. అయితే దీనిని తిరస్కరిస్తూ.. ఇతర బోర్డులతో పోల్చితే తమకిచ్చే మొత్తం చాలా తక్కువని కొద్దీ రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడి క్రికెటర్లు. ఈ నేపథ్యంలో స్పందించిన బోర్డు.. ఈ కాంట్రాక్ట్‌పై సంతకాలు చేయడానికి జూన్ 3వ తేదీని డెడ్‌లైన్‌గా ఇటీవల ప్రకటించింది. వారి గత ప్రదర్శనల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు అరవింద డిసిల్వా చెప్పారు. అయినా క్రికెటర్లు వెనక్కి తగ్గలేదు. సమస్యను పరిష్కరించే వరకు సంతకాలు చేయమని ఇప్పుడీ సంయుక్త ప్రకటన ద్వారా మరోసారి తెలియజేశారు.
ఇదీ చూడండి బోర్డుతో ముదురుతున్న ఆటగాళ్ల కాంట్రాక్ట్ వివాదం!