Anurag Thakur on Kohli Rohit Rift: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వివాదం ముదురుతోందని వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్ నుంచి గాయం కారణంగా తప్పుకొన్నాడు రోహిత్. అలాగే వన్డే సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అనూహ్యంగా కోహ్లీని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించడమే ఇందుకు కారణమని సమాచారం. దీనిపై మాజీ క్రికటెర్లు సహా సహ ఆటగాళ్లు వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర యువజన, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయంపై స్పందించారు.
"ఎప్పటికైన క్రీడలే సుప్రీమ్. దీనికంటే ఎవరూ గొప్పవారు కాదు. ఏ ఆటలో, ఎవరి మధ్య ఏం జరిగిందో నేనే చెప్పట్లేదు. అది ఫెడరేషన్/అసోసియేషన్‌కు సంబంధించిన అంశం. వారు సమాచారం అందిస్తే బాగుంటుంది" అని ఠాకూర్ తెలిపారు.
గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు రోహిత్ శర్మ. దీంతో ఇతడి స్థానంలో ప్రియాంక్ పాంచల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా తీసుకుంది బీసీసీఐ. ఈ టెస్టు సిరీస్‌కు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ అనంతరం వన్డే మ్యాచ్‌ల్లో తలపడతాయి ఇరుజట్లు. ఈ టోర్నీ జనవరి 19న ప్రారంభమవుతుంది. అప్పటివరకు రోహిత్ కోలుకుని.. జట్టుకు సారథ్యం వహిస్తాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకోవాలని చూస్తున్నట్లు మరో అధికారి వెల్లడించారు.