Team India Nervous 19: టీమ్ఇండియా బౌలింగ్ బలహీనంగా ఉంది.. గత కొంతకాలంగా ఈ మాట వింటూనే ఉన్నాం. ప్రత్యర్థులు మారినా.. మన బౌలర్లకు ఈ సమస్య మాత్రం పోవడం లేదు. టీ20ల్లో ముఖ్యంగా డెత్ ఓవర్లలో మన బౌలర్లు స్ట్రీట్ క్రికెట్‌లో బౌలర్లలా మారిపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. అందులోనూ 19 ఓవర్ వచ్చేసరికి మన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ఆ ఓవర్ ఎవరు వేసినా.. పరిస్థితి ఇదే. ప్రపంచ ప్రఖ్యాత బౌలర్లుగా పేరు తెచ్చుకున్న వారు కూడా సుమారు 20 పరుగులు ఇచ్చేస్తున్నారు.
గత కొంతకాలంగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లు చూస్తే.. ఈ విషయం మీకు పక్కాగా అర్థమైపోతుంది. ప్రత్యర్థితో చిన్న జట్టా,పెద్ద జట్టా.. వాళ్ల రీసెంట్ ఫామ్ ఇలా ఏ విషయంతోనూ సంబంధం లేకుండా ఆఖరి ఓవర్లలో అందులోనూ 19వ ఓవర్‌లో మన బౌలర్లు.. బ్యాటర్లకు దాసోహం అంటున్నారు. రీసెంట్ మ్యాచ్ చూసుకుంటే.. అక్టోబరు రెండున గువాహటిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ 19వ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి టీ20 లోస్కోరింగ్ మ్యాచ్.. అందులోనూ 17 పరుగులు ఇచ్చుకున్నాడు. దీని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
19వ ఓవర్‌లో పరుగుల వరద ఇలా..
ఆ ఒక్క ఓవరే..
నిజానికి అర్ష్‌దీప్ ఒక్కడే కాదు.. మిగిలిన బౌలర్లు కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. జట్టును ఇబ్బంది పెడుతున్నారు. 18వ ఓవర్, 20 ఓవర్ విషయంలో బాగానే బౌలింగ్ చేస్తున్నా 19వ ఓవర్‌కి వచ్చేసరికి మనవాళ్లకు ఏదో తెలియని ఇబ్బంది వస్తోందేమో అని సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి. ప్రపంచంలోనే బెస్ట్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌లుగా పేరున్న భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా లాంటివాళ్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాళ్లు కూడా 19వ ఓవర్ వేసి.. అభిమానులకు నిట్టూర్పులే మిగులుస్తున్నారు. ఆ కీలక ఓవర్ దగ్గరకు వచ్చేసరికి రెగ్యులర్ బౌలర్‌లా వారి బౌలింగ్ మారిపోతోంది అని విమర్శలు వస్తున్నాయి. బుమ్రా ఇటీవల ఈ ఓవర్ వేసింది తక్కువే అయినా.. వేసిన ఓవర్‌లో పరుగులు ఎక్కువే ఇచ్చాడు.
ఇక భువనేశ్వర్ అయితే పరుగులకు అడ్డుకట్ట వేయలేకపోయాడు. వేగం లోపించడం, తనదైన యార్కర్లు సంధించలేకపోవడంతోనే ఈ సమస్యలు అని సీనియర్లు చెబుతున్నారు. హార్దిక్ పాండ్య లాంటి ఆల్‌రౌండర్‌తో ఆ ఓవర్ వేయించే ధైర్యం చేయడం లేదు. అయితే అతను కూడా అంతకుముందు ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చేస్తుండటం గమనార్హం. దీంతో భారత బౌలింగ్‌లో 19వ ఓవర్ వస్తే సరి టీవీలు కట్టేద్దాం, మొబైల్స్ పక్కన పెట్టేద్దాం అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కనిపిస్తున్నాయి.
రోహిత్ ఏమన్నాడంటే..
19వ ఓవర్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ బౌలర్లను వెనకేసుకొచ్చాడు. ఆ ఓవర్‌లో బౌలింగ్, బ్యాటింగ్ రెండూ కష్టమే అని టీమ్‌కి బ్యాకింగ్ చేశాడు. కానీ టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా పట్టుమని 20 రోజులు కూడా లేని ఈ సమయంలో ఇలా డెత్ బౌలింగ్, అందులోనూ కీలకంగా చెప్పుకునే 19వ ఓవర్ వేసే బౌలర్ ఎవరు అనే విషయంలో భయాలు ఉన్నాయి అంటే జట్టుకు ఏ మాత్రం మంచిది కాదు.
"డెత్ ఓవర్ల అంశం ఆందోళన కలిగించలేదు. అయితే మ్యాచ్ చివరలో జట్టు పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. గత ఐదారు మ్యాచ్‌ల్లో డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయలేదు. ఆ అంశమే మాకు సవాలు విసురుతోంది. డెత్‌లో బౌలింగ్, బ్యాటింగ్ చేయడం కష్టమే. ఆట ఫలితం తేలేదీ ఇక్కడే. అలా అని డెత్ వైఫల్యం ఆందోళన చెందే విషయమని నేను చెప్పను. కానీ.. కచ్చితంగా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది"
- రోహిత్ శర్మ
ఆ మొనగాడు ఎవరు?
టీ20 ప్రపంచకప్ జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇప్పటికిప్పుడు అయితే ఇందులో బుమ్రా ఒక్కడే ఆ 19వ ఓవర్ కాస్త బాగా వేస్తున్నాడు, వేశాడు కూడా. కానీ గాయం కారణంగా బుమ్రా సౌతాఫ్రికా సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో కొనసాగుతాడా లేదా అనేది తెలియడం లేదు. దీంతో మిగిలిన బౌలర్లే 19వ ఓవర్‌వేయాలి. దానికితోడు నెర్వస్ 19 సంగతి తేల్చుకోవడానికి భారత్‌కి ఇంకా ఒక్క అంతర్జాతీయ మ్యాచే ఉంది. ఆ తర్వాత రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలో ఉంటాయి. అంటే మూడు మ్యాచ్‌ల్లో 19వ ఓవర్ వేసే మొనగాడు ఎవరు అనేది తేలాలి.
బుమ్రా జట్టుకు దూరమైతే జట్టులోకి మహ్మద్ షమీ లేదా దీపక్ చాహర్ వస్తారు. వారిలో ఎవరైనా ఆ భరోసా ఇస్తే హ్యాపీనే. ఈ ‘నెర్వస్ 19’ వ్యవహారంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రేతో కలసి కెప్టెన్ రోహిత్ శర్మ కూర్చోవాల్సిందే. దానికి తగ్గట్టుగా తన బౌలర్లను సిద్ధం చేయాల్సిందే. ఈ ఓవర్‌లో బౌలింగ్ చేయాలంటే టెక్నిక్, వైవిధ్యం రెండూ ఉన్న బౌలర్ కావాలి. నిజానికి మన దగ్గర అలాంటి బౌలర్లు ఉన్నారు. కానీ వాళ్లు ఆశించిన మేర క్లిక్ అవ్వడం లేదు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం టీమ్ మేనేజ్‌మెంట్‌కి ఉంది.
సో.. కమాన్ టీమ్ ఇండియా. 'నెర్వస్ 19' దాటు.. మెల్‌బోర్న్‌లో అదరగొట్టి కప్ తీసుకొచ్చేయ్.
ఇవీ చదవండి: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్‌కు స్పెషల్ గెస్ట్‌గా మిథాలీ రాజ్
జాతీయ క్రీడల్లో తెలంగాణ, ఏపీ జోరు.. 'తెలుగు' అథ్లెట్లకు పతకాల పంట