smith breaks sachin record: పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఆసీస్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 150 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 85వ టెస్టు ఆడుతున్న స్మిత్ తన 150వ ఇన్నింగ్స్‌లో 59 రన్స్ చేశాడు. టెస్టు కెరీర్‌లో మొత్తం 7,993 పరుగులకు చేరుకున్నాడు. దీంతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను స్మిత్ అధిగమించాడు. సంగక్కర 150 ఇన్నింగ్స్‌ల్లో 7,913 పరుగులు చేయగా.. సచిన్ 7,869 పరుగులు చేశాడు. వీరి తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (7,694), రాహుల్ ద్రవిడ్ (7,680) ఉన్నారు.
పాక్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్టీవ్ స్మిత్ వరుసగా మూడో అర్ధశతకం సాధించాడు. రావల్పిండి మ్యాచ్‌లో (78), కరాచీ టెస్టులో (72) రాణించిన స్మిత్.. ప్రస్తుతం జరుగుతున్న లాహోర్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 391 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌తో పాటు ఖవాజా (91), గ్రీన్ (79), అలెక్స్ క్యారీ (67) హఫ్ సెంచరీలు సాధించారు. పాక్ బౌలర్లు షహీన్ అఫ్రిది (4/79), నసీమ్ షా (4/48) చెలరేగారు. ఇక పాకిస్థాన్ రెండో రోజు (నిన్న) ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజ్‌లో అబ్దుల్లా షఫీఖ్ (45*), అజహర్ అలీ (30*) ఉన్నారు. ఇమామ్ ఉల్ హక్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీసుకున్నాడు.
ఇదీ చదవండి: 'పాంటింగ్ కోచింగ్‌లో పంత్ మరింత రాటుదేలుతాడు'