Ross Taylor RR Team: కివీస్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ సంచలన విషయం బయటపెట్టాడు. భారత టీ20 లీగ్‌లో ఆడినప్పుడు ఓ ఫ్రాంచైజీ యజమాని తన మొహం మీద ఓ మూడు, నాలుగుసార్లు కొట్టాడని ఆరోపించాడు. ఇదే విషయాన్ని తన జీవిత చరిత్ర 'బ్లాక్ అండ్ వైట్' పుస్తకంలో వెల్లడించాడు. ఈ వారంలోనే ఈ బుక్ విడుదలైంది. రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని టేలర్ అందులో పేర్కొన్నాడు.
"మొహాలీ వేదికగా పంజాబ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో నేను డకౌట్‌గా పెవిలియన్‌కు చేరా. ఆ మ్యాచ్‌లో మేం 195 పరుగులను ఛేదించాల్సి ఉంది. అయితే మేం దానిని అందుకోలేకపోయాం. మ్యాచ్ ముగిశాక జట్టుతోపాటు సహాయక సిబ్బంది, మేనేజ్‌మెంట్ హోటల్‌లో కూర్చొన్నాం. అక్కడ షేన్ వార్న్, లిజ్ హుర్లే తదితరులు ఉన్నారు. అయితే రాజస్థాన్ జట్టు యజమానుల్లో ఒకరు నా దగ్గరకు వచ్చి 'రాస్, మీరు డకౌట్‌గా వస్తే మిలియన్ డాలర్లను చెల్లించం'' అని నా మొహం మీద చిన్నగా మూడు నాలుగుసార్లు కొట్టాడు. అప్పటికీ అతడు నవ్వుతూనే ఉన్నాడు. అవేవీ గట్టి దెబ్బలు కాదు. అయితే ఇది కావాలని నాటకమాడినట్లు పూర్తిగా అనిపించలేదు. ఇక ఆ పరిస్థితుల్లో నేనూ పెద్ద విషయం చేయదల్చుకోలేదు. అయితే క్రీడావృత్తిలో ఇలాంటి పరిస్థితిని వస్తుందని ఊహించలేదు" రాస్ టేలర్ వివరించాడు. అయితే ఏ సంవత్సరంలో జరిగిందనే విషయం మాత్రం తెలపలేదు. భారత టీ20 లీగ్‌లో టేలర్ 55 మ్యాచులు ఆడి 1,017 పరుగులు సాధించాడు.
ఇవీ చదవండి: టీమ్ఇండియాకు సవాల్ విసిరిన ఆ దేశ క్రికెట్ కోచ్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ధోనీ బీసీసీఐ అధికారి ఏం చెప్పారంటే