ఒకరిదేమో అంతర్జాతీయంగా 57 టెస్టుల అనుభవం.. మరొకరు ఇప్పుడే అరంగేట్రం చేసిన యువ క్రికెటర్.. అయితే వీరిద్దరి జెర్సీ నంబర్ (8) ఒకటే కావడం విశేషం. అదేవిధంగా ఇద్దరూ ఎడమచేతివాటం బ్యాటర్లు, బౌలర్లు.. అంతేనా.. ఆల్‌రౌండర్లు కూడానూ.. ఇప్పుడు ఒకే టెస్టు మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.. పేర్లలోనూ కాస్త సారూప్యత కలిగిన ఆ ఆటగాళ్లు.. రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర. టీమ్ఇండియా టాప్ ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ Test) మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించాడు. బౌలింగ్‌లోనూ పొదుపుగా (33-10- 57-1) బౌలింగ్ చేశాడు. కివీస్ తరఫున అరంగేట్రం చేసిన రచిన్ రవీంద్ర ఇప్పటివరకైతే (7-1-28-0) పెద్దగా ప్రభావం చూపలేదు. అటు బ్యాటింగ్‌లోనూ 13 పరుగులే చేశాడు. తొలి టెస్టు ఆడుతున్న రచిన్ రవీంద్రను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజానే క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం.
రెండు జట్లలోనూ ఎ. పటేల్‌లు..
టీమ్‌ఇండియా, కివీస్ జట్లలో ఎ.పటేల్ పేరు కలిగిన ఆటగాళ్లు ఉన్నారని మీకు తెలుసా..? అవును నిజంగానే.. అయితే షార్ట్‌కట్‌లో ఇద్దరి పేర్లు ఒకటే కానీ.. అసలు పేర్లైతే వేరేలేండి.. భారత్ తరఫున ఆడుతున్న ఎ.పటేల్ పూర్తి పేరు అక్షర్ పటేల్. మరి కివీస్ జట్టుకు ఆడే ఎ. పటేల్ కూడా ఉన్నాడు. అయితే అతడి పేరు అజాజ్ పటేల్.. కివీస్ తరఫున పది టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. మన అక్షర్‌కిది ఐదో టెస్టు మాత్రమే. అంతేకాదండోయ్.. ఇద్దరి పేర్లలోనూ పోలిక ఉన్నట్లే వారి బ్యాటింగ్, బౌలింగ్ శైలి కూడానూ ఒకటే. ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు. ఎడమ చేతివాటం బ్యాటర్లు. అయితే అక్షర్ అప్పుడప్పుడూ బ్యాటింగ్ కూడా చేయగలడు కానీ.. అజాజ్ బౌలర్‌గానే ఎంపికయ్యాడు. రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ కుటుంబాలు భారతీయ సంతతికి చెందినవే.
రెండు రోజుల ముగింపు ఒకేలా..
తొలి రెండు రోజుల ముగింపు సందర్భంగా క్రీజ్‌లో ఉన్న బ్యాటర్ల స్కోరు ఒకేలా ఉండటం విశేషం. తొలుత టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని కివీస్‌కు బౌలింగ్ అప్పగించింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమ్ఇండియా స్కోర్ 258/4. క్రీజులో శ్రేయస్ అయ్యర్ (75*), జడేజా (50*) నిలిచారు. ఇక రెండో రోజు కివీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్ (75*), లాథమ్ (50*) నిలిచారు. ఇలా రెండు రోజుల్లోనూ ఆట పూర్తయ్యే సమయానికి ఇరుజట్లలోని ఆటగాళ్ల స్కోర్లు ఒకటే కావడం విశేషం.
IND vs NZ Test Scorecard: మూడో రోజు భారత బౌలర్ల దెబ్బకు కివీస్ 296 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్‌ఇండియాకు 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 14/1తో ఉంది. శుభ్‌మన్ గిల్ (1) త్వరగా ఔటవ్వగా.. క్రీజ్‌లో మయాంక్ అగర్వాల్ (4*), పుజారా (9*) ఉన్నారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 63 పరుగుల ఆధిక్యంలో భారత్ నిలిచింది.