Ravi Shastri on team india: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా పేలవ ప్రదర్శనపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అన్ని మ్యాచ్‌లు గెలవలేమని, భారత జట్టులో ఇప్పుడున్న పరిస్థితి తాత్కాలికమేనన్నాడు.
"మనం ఒక్కసిరీస్ కోల్పోయినా ప్రజలు విమర్శలు చేస్తూనే ఉంటారు. మనం ప్రతి మ్యాచ్ గెలవలేం. ఆటలో గెలుపు ఓటమి సహజం." అని రవిశాస్త్రి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా ఘోరంగా ఓడిపోయింది. 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.
మన ప్రత్యర్థులు భయపడాలి..
గత ఐదేళ్లుగా టీమ్ఇండియా జట్టు నెంబర్ 1గా కొనసాగుతూనే ఉందని, జట్టు ప్రమాణాలు ఏమాత్రం తగ్గలేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమ్ఇండియా ప్రదర్శనపై ఏమాత్రం సందేహం వద్దన్నాడు.
"భారత జట్టు గత ఐదేళ్ల నుంచి 65 శాతం విన్నింగ్ రేట్‌తో ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి. ప్రత్యర్థి జట్లు భయపడాలి." అని శాస్త్రి అన్నాడు.
కోహ్లీ రిటెర్మెంట్‌పై స్పందిస్తూ.. "ఆ నిర్ణయం అతడి వ్యక్తిగతం. దాన్ని మనం గౌరవించాలి. గతంతో ఎంతోమంది కెప్టెన్సీ నుంచి వైదొలిగారు. బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని అనుకున్నప్పుడు ఇలాంటివి సహజం. నా ఆటగాళ్ల గురించి పబ్లిక్‌లో చర్చించాల్సిన అవసరం తనకు లేదు."అన్నాడు రవిశాస్త్రి.
హిట్‌మ్యాన్‌కు టెస్టు పగ్గాలు?
టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటే.. పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతడికే ఎందుకు అప్పగించకూడదని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతేడాది డిసెంబరులో రోహిత్‌కి టెస్టు ఫార్మాట్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే, గాయం కారణంగా అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం.. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను వదిలేస్తున్నట్లు ప్రకటించాడు.
"రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటే.. టెస్టు ఫార్మాట్‌కు కూడా అతడినే ఎందుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించకూడదు.? ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడిని.. కెప్టెన్‌గా ఎందుకు ప్రమోట్ చేయకూడదు. రిషభ్ పంత్ కూడా అద్భుతమైన ఆటగాడు. ఒక కోచ్‌గా అతడి ఆట తీరు పట్ల గర్వపడుతున్నాను. ఆట పట్ల అతడి దృక్పథం చాలా గొప్పగా ఉంటుంది. చాలా మంది అతడు నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకుంటాడని చెబుతుంటారు. అందులో వాస్తవం లేదు. అతడు ఆటను బాగా అర్థం చేసుకుంటాడు." అని రవిశాస్త్రి తెలిపాడు.
'జట్టు విజయం కోసం రోహిత్ శాయశక్తులా కష్టపడతాడని. అందుకే కెప్టెన్సీ గురించి చర్చ జరిగినప్పుడు అతడిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి' అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: దక్షిణాఫ్రికాపై టీమ్ఇండియా ఓటమి.. మాజీలు ఏమన్నారంటే?