Ranji Trophy Bihar Team : రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో ముంబయి- బిహార్ మ్యాచ్ ఆరంభం సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ముంబైతో టెస్టులో తలపడేందుకు బిహార్ నుంచి రెండు వేర్వేరు క్రికెట్ జట్లు మైదానానికి రావడం వల్ల కొద్ది సేపు గందరగోళం నెలకొంది. దీంతో శుక్రవారం నాటి తొలి రోజు ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
బిహార్ – ముంబయి మధ్య పాట్నాలోని మోయిన్ ఉల్ హక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే తుది జట్లను ప్రకటించే సమయంలో బీసీఏ ప్రెసిడెంట్, సెక్రటరీలకు సంబంధించిన రెండు జట్లు గ్రౌండ్‌లోకి వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. బీసీఏ ప్రెసిడెంట్ రాకేశ్ తివారి, సెకట్రరీ అమిత్ కుమార్‌లు పోటాపోటీగా జట్లను ప్రకటించడం వల్ల అసలు ముంబయి జట్టుతో ఆడబోయే టీమ్ ఏదంటూ అందరూ కన్ఫ్యూజన్లో పడిపోయారు. చివరికి పోలీసుల రాకతో చేసి సెక్రటరీ అమిత్ కుమార్ వర్గం సభ్యులను అక్కడ నుంచి పంపించేయడం వల్ల ముంబయి జట్టు రాకేశ్ తివారి ప్రకటించిన బిహార్ జట్టుతో ప్రస్తుతం మ్యాచ్ ఆడుతోంది.
ఇక మ్యాచ్ మొదలయ్యాక బీసిఏ అధ్యక్షుడు తివారీ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సెక్రటరినీ తాము సస్పెండ్ చేశామని, అందుకే ఆయన జట్టును ఎంపిక చేయడం చెల్లదని అన్నారు. తాను ఆటగాళ్ల ప్రతిభాపాటవాలను చూసి తుది జట్టును ఎంపిక చేశానంటూ చెప్పుకున్నారు. మరోవైపు సెక్రటరీ అమిత్ కుమార్ కూడా ఈ విషయంపై స్పందించారు. తనను సస్పెండ్ చేసే అధికారాలు అధ్యక్షుడికి లేదని పేర్కొన్నారు. తుది జట్టును సెక్రట్రీనే ఎంపిక చేస్తారని, అధ్యక్షుడికి ఆ హక్కు లేదంటూ అమిత్ కుమార్ వాదించారు.
మరోవైపు ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబయి జట్టు తొలి రోజు తొమ్మిది వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఇక బీహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్ అద్భుతంగా రాణించాడు. కేవలం 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
మణికట్టు విరిగినా ఒంటిచేత్తో పోరాటం.. రంజీలో ఆంధ్ర సారథి హనుమ 'విహారం'..
బంగాల్పై ఘన విజయం.. రెండో సారి రంజీ ట్రోఫీని ముద్దాడిన సౌరాష్ట్ర