India Australia T20 Series : దాదాపు మూడేళ్ల తర్వాత శతకం సాధించి ఫామ్ అందుకొన్న విరాట్ కోహ్లీ (276) ఆసియా కప్‌లో అదరగొట్టాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో టీ20లకు సిద్ధమైపోయాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 20న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆసీస్ వైస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. విరాట్ ఫామ్‌లోకి వస్తాడనడంలో తమకు ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. భారత్-ఆసీస్ జట్ల జరిగే మ్యాచుల్లో స్టార్ బ్యాటర్ సవాల్ విసురుతాడని అభిప్రాయపడ్డాడు. టీమ్‌ఇండియాతో సిరీస్ ప్రారంభం నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడాడు.
"ఆసియా కప్‌ను పెద్దగా గమనించలేదు. లంక గెలిచినట్లు ఉంది. విరాట్ ఆటను చూశా. సెంచరీ కొట్టాడు. కోహ్లీ క్లాస్ ప్లేయర్. అతడు ఎప్పుడైనా ఫామ్‌లోకి వస్తాడని తెలుసు. వచ్చేవారం జరిగే మ్యాచుల్లో మాకు విరాట్ సవాల్‌గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా భారత్‌లో ఆడేటప్పుడు పేసర్లు త్వరగా పరిస్థితులను అలవర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడి పిచ్‌లు పేస్‌ను విభిన్నంగా సంధించాల్సి ఉంటుంది. బౌండరీలు కాస్త చిన్నవిగా ఉంటాయి. వికెట్ కూడా స్లోగా ఉంటుంది" అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.
ఇవీ చదవండి: బౌలర్లు.. గాడిన పడతారా? కప్పు తెస్తారా?