Pant Low Phase: రిషభ్ పంత్.. చిన్న వయసులోనే తన క్రికెట్ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఒక్కసారిగా స్టార్ ముద్ర, కొద్దిరోజులకే కిందికి.. అద్భుత ప్రదర్శనతో మళ్లీ తిరుగులేని స్థాయికి.. ఇలా పంత్ ఎన్నో సంధి దశలను ఎదుర్కొన్నాడు. 19 ఏళ్ల వయసుకే 2017లో టీమ్ఇండియాకు ఆడినా.. మరుసటి ఏడాది టెస్టు అరంగేట్రంతోనే తనకు గుర్తింపు వచ్చింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో సెంచరీలు చేసి.. ప్రపంచ క్రికెట్‌కు తన రాక గురించి గొప్ప సంకేతాలు ఇచ్చాడు. ఆ తర్వాత.. విజయ్ శంకర్‌కు గాయంతో పంత్ వరల్డ్‌కప్ జట్టులో చోటు సంపాదించాడు. ఎంత వేగంగా ఎదిగాడో అదే స్థాయిలో కిందికి పడిపోయాడు. 2019 ద్వితీయార్ధంలో పరిమిత ఓవర్ల జట్టునుంచి పంత్ ఉద్వాసనకు గురయ్యాడు. రోజులు, నెలలుకాదు.. పునరాగమనం కోసం దాదాపు సంవత్సరం పాటు నిరీక్షించాడు.
ఆసీస్‌పై భారత్ 36 పరుగులకే ఆలౌటైన అడిలైడ్ టెస్టులో వికెట్ కీపర్ సాహాకు గాయమైంది. వెంటనే పంత్‌కు ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశాలను రెండుచేతులా అందిపుచ్చుకున్నాడు. ఇక వెనుదిరిగిచూసుకునే అవకాశమే రాలేదు. మెల్బోర్న్, బ్రిస్బేన్ (గబ్బా) టెస్టుల్లో భారత్ గెలిచింది. గబ్బా టెస్టులో భారత్ విజయంలో పంత్‌దే కీలకపాత్ర. సిడ్నీ టెస్టులోనూ పంత్ వీరోచిత ప్రదర్శనతోనే డ్రా అయింది. ఇప్పుడు.. టీమ్ఇండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న అతికొద్దిమందిలో పంత్ ఒకడు. పరిస్థితులకు అతీతంగా రాణిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 24 ఏళ్లకే జట్టులో చోటు సుస్థిరం చేసుకున్నా.. ఒకప్పటి కెరీర్ క్లిష్ట స్థితిని మర్చిపోలేకపోతున్నాడు పంత్. ఇటీవల ఓ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి విషయాల గురించి వెల్లడించాడు.
''అప్పుడు నాకు చాలా కష్టసమయం నడిచింది. అందరితో దూరంగా ఉన్నా. ఎవరిదగ్గరికైనా వెళ్లాలంటే.. చాలా ఇబ్బందిగా అనిపించేది. కేవలం నాపైనే నమ్మకం ఉంచా. ప్రపంచానికి నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నా. నా అవకాశం కోసం ఎదురుచూశా. రోహిత్, ధోనీలతో మాత్రమే కొద్దిగా మాట్లాడేవాడిని. ఎక్కువగా నన్ను నేను నమ్ముకుంటూ ముందుకుసాగా.''
- రిషభ్ పంత్, టీమ్ఇండియా క్రికెటర్
పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్ కంటే.. టెస్టుల్లోనే బాగా రాణించాడు. 30 టెస్టుల్లో 40.85 సగటుతో 1920 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. ఇందులో ఇంగ్లాండ్‌పై 100 బంతుల్లో హాఫ్‌సెంచరీ చేస్తే.. ఇటీవల బెంగళూరులో శ్రీలంకపై 28 బంతుల్లోనే చేశాడు. 24 వన్డేల్లో 32.5 సగటుతో 715 స్కోరు చేశాడు. ఇందులో 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. 43 టీ20ల్లో 24.39 సగటుతో 683 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు పంత్.
ఇవీ చూడండి: 'ధోనీ ధాటిగా ఆడలేదు.. అక్కడే చెన్నై ఆగిపోయింది'