Mithali Raj Ramesh Powar fight: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది టీమ్ఇండియా దిగ్గజం మిథాలీ రాజ్. అయితే, 2018లో హెడ్‌కోచ్ రమేశ్ పొవార్‌తో ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఆ ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ సందర్భంగా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్‌ఇండియా జట్టులోకి మిథాలీని తీసుకోకుండా పొవార్ పక్కనపెట్టాడు. దీంతో అప్పట్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ విషయం బీసీసీఐ దృష్టికి కూడా చేరింది. అయితే, తాజాగా మిథాలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ వివాదం ఎలా సద్దుమణిగిందో చెప్పింది.
"మనం ఏదైనా చిక్కుల్లో పడితే సరైన నిర్ణయాలు తీసుకోలేం. అప్పుడు మనలో విపరీతమైన భావోద్వేగాలుంటాయి. వాటిని మనసుకు తీసుకోకున్నా ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటాం. అలాంటప్పుడు ఏదీ స్పష్టంగా ఆలోచించలేం. అప్పుడు కొంత సమయం తీసుకొని దాని నుంచి బయటపడాలి. అప్పుడు మూడో వ్యక్తి కోణంలో ఆలోచిస్తే.. వాటికి సరైన సమాధానం దొరుకుతుంది. ఆ వివాదాలకు స్పందించాలా? వదిలేయాలా? అనేది తెలుస్తుంది. అయితే, కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిది" అని మిథాలీ చెప్పుకొచ్చింది.
"మనపట్ల ఎవరైనా పక్షపాతం చూపించినప్పుడు దాన్ని స్వీకరించడానికి ధైర్యం కావాలి. ప్రతి ఒక్కరికీ అప్పుడు ఏం జరిగిందనేది ఒకవైపే తెలుసు. అయినా నేను ఆట పట్ల అంకితభావంతో ఉన్నా కాబట్టి దాన్ని వదిలేశాను. వీలైనంత వరకూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే కోరుకున్నా. ఆ సమయంలో మానసికంగా ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అలా ఉంటేనే మైదానంలో మంచి ప్రదర్శన చేస్తాననుకున్నా. ఆ వివాదం నుంచి బయటపడాలంటే దాన్ని వదిలేయాలి లేదా బాధపడాలి. అందులో నేను చిక్కుకోవాలని అనుకోలేదు. ఆ గడ్డు పరిస్థితి దాటిపోవాలని భావించా. నాకు క్రికెట్ నేర్పింది అదే’ అని మిథాలీ తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: భారత్‌ను దాటేసిన పాకిస్థాన్.. ఆ జాబితాలో మనకంటే మెరుగ్గా..