ICC T20 World Cup 2022 : ప్రపంచకప్ ముంగిట మిగతా జట్లన్నీ తమ బలాబలాల్ని సమీక్షించుకుంటూ, జట్టు కూర్పుపై లెక్కలు వేసుకుంటూ, ప్రత్యర్థులను ఎలా దెబ్బ తీయాలో ప్రణాళికలు రచిస్తుంటే.. టీమ్ ఇండియా మాత్రం ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యల గురించి కంగారు పడుతూ, గాయపడ్డ ఆటగాళ్ల స్థానంలో ఎవరిని ఎంచుకోవాలా అని కసరత్తు చేస్తోంది.
గతేడాది ప్రపంచకప్ అనంతరం చాలామంది ఆటగాళ్లు గాయాలతో సిరీస్‌లకు దూరం అవుతూ వచ్చారు. అయితే తాజాగా గాయం నుంచి కోలుకుని దక్షిణాఫ్రికా సిరీస్‌లోకి వచ్చిన బుమ్రా.. వెన్ను నొప్పితో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఆల్‌రౌండర్ జడేజా దూరం కావడమే పెద్ద దెబ్బ అంటే.. ఇప్పుడు బౌలింగ్ దళపతి బుమ్రా కూడా ప్రపంచకప్‌కు దూరమవడం జట్టు విజయ అవకాశాలనే ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన బుమ్రా.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కూడా ఆడలేక పోయాడు. అనంతరం సౌతాఫ్రికా సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఆడి టీమ్ ఇండియా ప్లేయర్స్‌కు కాస్త రిలీఫ్ ఇచ్చాడు. కానీ ఇంతలోనే గాయంతో వెనుదిరిగాడు.
అయితే బుమ్రా విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. "జస్ప్రీత్ బుమ్రా ఇంకా టీ20 వరల్డ్ కప్ నుంచి ఇంకా బయటకు వెళ్లలేదు. వరల్డ్ కప్‌నకు ఇంకా టైం ఉంది. ఇప్పుడే ఇలా అనడం భావ్యం కాదు" అని చెప్పాడు. ప్రస్తుతం బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అతడిపై గాయం తీవ్రతను తెలుకునేందుకు పరీక్షలు జరుగుతున్నాయి.
ఇవీ చదవండి : వైరల్‌గా మారిన రోజర్ ఫెదరర్ పోస్ట్.. అది ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలంటూ..