Ishan Kishan Kohli Advice: ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో విశేషంగా రాణించి.. టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నాడు యువ ఓపెనర్ ఇషాన్ కిషన్. దేశవాళీల్లోనూ జార్ఖండ్‌కు ఆడిన కిషన్.. ఎన్నో పరుగులు చేశాడు. తన టీ-20, వన్డే అరంగేట్ర మ్యాచ్‌ల్లోనూ అర్ధసెంచరీలు చేశాడు ఈ యువ వికెట్‌కీపర్- బ్యాటర్. గతేడాది మార్చి 14న ఇంగ్లాండ్‌తో రెండో టీ-20లో ఇతడికి ఆడే అవకాశం వచ్చింది. అంతర్జాతీయ కెరీర్లో ఇషాన్‌కు అదే తొలి మ్యాచ్. 165 పరుగుల లక్ష్యఛేదనలో కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. తొలి ఓవర్లోనే అన్ని బంతులాడి రాహుల్ అవుటవుతాడు. ఆ తర్వాత కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపిస్తాడు ఇషాన్ కిషన్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇషాన్‌కే దక్కింది. అయితే.. ఆరోజు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ యూట్యూబ్ షోలో వెల్లడించాడు స్టార్ ఓపెనర్. రెండో ఓవర్ వేసేందుకు వచ్చిన జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టమని కోహ్లీ చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు ఇషాన్. కానీ.. అది ఫోర్ వెళ్లిందని చెప్పుకొచ్చాడు.
''నేను రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించా. అతడు అవుట్ కాగానే కోహ్లీ వచ్చాడు. అప్పటికి నాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో ఓవర్ బౌలింగ్ వేసేది జోఫ్రా ఆర్చర్. అప్పుడే కోహ్లీ నా దగ్గరికి వచ్చి.. 'అటు చూడు.. అక్కడ ఫీల్డర్ ఎవరూ లేరు. సిక్స్ కొట్టు' అన్నాడు. వెంటనే.. నేను షాక్‌తో 'ఉమ్.. అక్కడ ఆర్చర్!' అని చెప్పా. కానీ.. కోహ్లీ చెప్పినదాని గురించి ఆలోచిస్తే.. నిజమే అనిపించింది. అదే ఏరియాలో కొట్టా. కానీ బంతి ఫోర్ వెళ్లింది. ఆర్చర్ బౌలింగ్‌లో నా అంతర్జాతీయ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతికి బౌండరీ వెళ్లినందుకు సంతోషపడ్డా.''
- ఇషాన్ కిషన్
అదే ఏడాది వన్డే అరంగేట్రం కూడా చేశాడు ఇషాన్. టీమ్ఇండియా ప్రధాన జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా.. శిఖర్ ధావన్ నేతృత్వంలో, రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అప్పుడు ఇషాన్ కిషన్ ఈ జట్టుకు ఎంపికయ్యాడు. తన తొలి వన్డేలోనే 42 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్, రెండో బంతిని ఫోర్‌గా మలచడం విశేషం. అప్పుడు ధావన్‌తో జరిగిన సంభాషణను కూడా ఇషాన్ గుర్తుచేసుకున్నాడు. ''నేను తొలి బంతికి సిక్స్, రెండో బంతికి ఫోర్ కొట్టా. వెంటనే ధావన్ వచ్చి.. 'బ్రో ఏంటి ప్లాన్?' అని అడిగాడు. బంతిని సరిగా చూసి కొడుతున్నట్లు చెప్పానని'' అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున అదరగొడుతున్నాడు కిషన్. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 135 పరుగులు చేశాడు. ఈసారి మెగా వేలంలో ఇషాన్‌ను రికార్డు స్థాయిలో రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్.
ఇవీ చూడండి: 'ధోనీ ఏదో చెప్పాడు.. వెంటనే అవుట్ అయిపోయా'