బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యాను ఆల్‌రౌండర్‌గా పరిగణించవచ్చా? అని భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev Hardik Pandya) ప్రశ్నించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలకంగా మారతాడని భావించిన పాండ్యా ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో కేవలం రెండు మ్యాచుల్లోనే బౌలింగ్ చేశాడు. అంతకుముందు జరిగిన ఐపీఎల్‌లోనూ అసలు బౌలింగ్ చేయలేకపోయాడు. బ్యాటింగ్‌లో కూడా పెద్దగా రాణించింది లేదు. ఈ క్రమంలో పాండ్యా ఫిట్‌నెస్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో హార్దిక్ పాత్రపై కపిల్ స్పందించాడు.
"ఎవరైనా క్రికెటర్‌ను ఆల్‌రౌండర్‌గా పిలవాలంటే బౌలింగ్, బ్యాటింగ్ చేయగలగాలి. అయితే పాండ్యా బౌలింగ్ చేయడం లేదు కాబట్టి అతడిని ఆల్‌రౌండర్ అని పిలుస్తామా? గాయం నుంచి కోలుకున్న పాండ్యాను మొదట బౌలింగ్ చేయనివ్వండి. టీమ్‌ఇండియాకు పాండ్యా చాలా ముఖ్యమైన బ్యాటర్. అలానే ఎక్కువ మ్యాచుల్లో బౌలింగ్ చేయాలి. ఇటు బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రదర్శన చేస్తే అప్పుడు ఆల్‌రౌండర్‌గా పిలవొచ్చు" అని కపిల్ పేర్కొన్నాడు.
Kapil Dev Favourite All Rounder: తన ఫేవరేట్ ఆల్‌రౌండర్లు ఎవరని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇద్దరు పేర్లను చెప్పాడు కపిల్. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తనకిష్టమైన ఆల్‌రౌండర్లని తెలిపాడు. అయితే జడేజా బ్యాటింగ్‌లో మెరుగుపడ్డాడని, బౌలింగ్‌లో కాస్త వెనుకంజలో ఉన్నట్లు అనిపిస్తోందని వివరించాడు. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసేవాడని, ఇప్పుడు సూపర్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. అయితే ప్రతిసారి అతడు టీమ్‌ఇండియాకు అవసరమయ్యే ఆటగాడని వివరించాడు.
Kapil Dev on Rahul Dravid: భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికను కపిల్ దేవ్ ప్రశంసించాడు. అపార అనుభవమున్న క్రికెటర్‌గా కంటే కూడా ద్రవిడ్ కోచ్‌గా విజయవంతమవుతాడని విశ్లేషించాడు. "వ్యక్తిగతంగా ద్రవిడ్ చాలా మంచి వ్యక్తి. ఇటు క్రికెటర్‌గానూ అనుభవజ్ఞుడు. క్రికెటర్‌గా కంటే కోచ్‌గా ఇంకా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే క్రికెట్‌లో అతని కంటే మెరుగ్గా ఎవరూ రాణించలేదు. అయితే ఒక్క సిరీస్‌కే అతడి సామర్థ్యాన్ని జడ్జ్ చేయకూడదు. అతడి పదవీకాలంలో చాలా చేస్తాడు. మనమంతా సానుకూల దృక్పథంతో ఉండాలి" అని కపిల్ తెలిపాడు.