MS Dhoni IPL 2022: చెన్నై మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎప్పటిలాగే మరోసారి అతిగొప్ప ఫినిషర్ అని నిరూపించుకున్నాడు. గతరాత్రి ముంబయితో తలపడిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 16 పరుగులు చేసి చెన్నైకి విజయాన్ని అందించాడు. దీంతో చెన్నై ఈ సీజన్‌లో రెండో విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు ధోనీ బ్యాటింగ్‌ను మెచ్చుకున్నారు.
'ఈ మ్యాచ్‌లో చివరివరకూ మేం అద్భుతంగా పోరాడాం. తొలుత సరిగ్గా బ్యాటింగ్ చేయకపోయినా మ్యాచ్‌లో నిలబడ్డాం. మా బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లారు. కానీ, ధోనీ ఎంత గొప్ప ఆటగాడో మనకు తెలిసిందే. అతడు కొండంత ఎత్తులో నిలబడి చెన్నైని విజయతీరాలకు తీసుకెళ్లాడు. మా ఓటమికి ఇదే కారణమంటూ ఏ ఒక్క విషయాన్ని వేలెత్తి చూపలేం. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం మేం నిజంగానే శుభారంభం చేయలేదు. ఆదిలోనే వికెట్లు కోల్పోతే మ్యాచ్‌లో ఉత్సాహంగా ఆడలేం. అయితే, చెన్నైపై ఒత్తిడి తెచ్చి మేం బాగానే ఆడామనుకుంటున్నా. ఆఖరి ఓవర్ వరకు ప్రయత్నించినా.. చివరికి ఫలితం లేకపోయింది' అని రోహిత్ అన్నాడు.
'ఈ మ్యాచ్ జరిగిన తీరు చూసి చాలా కంగారు పడ్డాం. అయితే, ఇక్కడ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఫినిషర్ ఉండటం వల్ల మేం గెలుస్తామనే నమ్మకం కలిగింది. మహీ ఇంకా మా జట్టు కోసం ఆడుతూ విజయాలు అందిస్తున్నాడు. అలాగే పవర్‌ప్లేలో ముఖేశ్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఎవరైనా ఒక్కోసారి క్యాచ్‌లు వదలడం జరుగుతుంది. అందుకే నేనెప్పుడూ ఫీల్డింగ్ గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేయను. అయితే, ఇప్పుడు మేం ఫీల్డింగ్‌పై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇలా క్యాచ్‌లు వదిలేసి మ్యాచ్‌లను కోల్పోలేం' అని జడేజా పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: MI vs CSK: లాస్ట్ ఓవర్లో చెలరేగిన ధోనీ.. ముంబయికి వరుసగా ఏడో ఓటమి