టీ20 లీగ్ ప్లే ఆఫ్స్‌లో భాగంగా బుధవారం లఖ్‌నవూ, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. రజత్ పటిదార్ (112; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో పటిదార్ రాత్రికిరాత్రే హీరోగా మారిపోయాడు. 2021లో బెంగళూరు జట్టు తరఫున రజత్ 4 మ్యాచ్‌లు ఆడి 71 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ ఫిబ్రవరిలో నిర్వహించిన మెగా వేలంలో రజత్ పటిదార్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. బెంగళూరు కూడా అతడిని రిటెన్షన్ చేసుకోలేదు. అయితే, బెంగళూరు జట్టులో లవ్‌నీత్ సిసోడియా గాయపడటం వల్ల అతడి స్థానంలో రూ.20 లక్షలతో మళ్లీ బెంగళూరే రజత్‌తో ఏప్రిల్‌లో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే, మెగా వేలంలో రజత్ పటిదార్‌ని ఎవరు కొనుగోలు చేయకపోవడం వల్ల మే 9న అతడి వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారట. బెంగళూరు జట్టు నుంచి పిలుపు రావడం వల్ల పెళ్లి వాయిదా వేశారట. 'రజత్ పటిదార్ వివాహన్ని మే 9న జరిపించాలని ప్లాన్ చేసుకున్నాం. ఈ వేడుకను అంగరంగ వైభవంగా కాకుండా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య నిర్వహించాలనుకున్నాం. అందుకే ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించలేదు. వివాహ వేడుక నిర్వహించడానికి ఇండోర్‌లో ఓ హోటల్‌ని కూడా బుక్ చేశాం. ఇంతలోనే బెంగళూరు జట్టు నుంచి పటిదార్‌కి పిలుపు వచ్చింది. జూన్‌లో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో పటిదార్ మధ్యప్రదేశ్ తరఫున ఆడనున్నాడు. కాబట్టి, జులైలో వివాహం జరిపించాలని ప్లాన్ చేస్తున్నాం' అని రజత్ పటిదార్ తండ్రి మనోహర్ పటిదార్ ఓ జాతీయ పత్రికతో అన్నారు.
ఇదీ చదవండి: రాజస్థాన్ X బెంగళూరు.. ఎవరి బలమెంత.. ఫైనల్‌కు వెళ్లేదెవరు?