ఐపీఎల్ వేలం ఎప్పుడు జరిగినా ముంబయి ఇండియన్స్ ఎవరెవర్ని తీసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా గమనిస్తారు. ఎందుకంటే ఒక ఆటగాడిలో ఉన్న అసలు సిసలైన సత్తాను నిక్కచ్చిగా అంచనా వేయగల బృందం వారి సొంతం. ఒక్కసారి వారి చూపు పడిందా ఆ ఆటగాడి దశ తిరిగినట్టే. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్ అలా వెలుగుచూసినవారే.
ఇటీవలే జరిగిన 14వ సీజన్ వేలంలో ముంబయి ఏడుగురు ఆటగాళ్లను తీసుకుంది. ముగ్గురిని రూ.20 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. అందులో అందరినీ ఆకర్షిస్తున్న ఆటగాడు మార్కో జన్‌సెన్. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ యువ ఆటగాడు ఎడమచేతివాటం పేసర్. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో చివరగా వచ్చి పరుగులు చేయగలడు. సఫారీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికి విపరీతమైన క్రేజ్ ఉంది. కేవలం 12 మ్యాచుల్లోనే 20.51 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. అలాంటి ఆటగాడికి తక్కువ ధరే పలకడం ఆశ్చర్యం వేసిందని ముంబయి అంటోంది.
![Marco Jansen has been a very highly rated bowler in south africa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10700036_3.jpg)
"యువ ఆటగాడు మార్కో జన్‌సెన్‌కు దక్షిణాఫ్రికాలో మంచి పేరుంది. అతడికి అంత తక్కువ ధర రావడం మమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. అతడిపై మరికొంత బిడ్డింగ్ నడుస్తుందని మేం అంచనా వేశాం."
- జహీర్ ఖాన్, ముంబయి ఇండియన్స్ డైరెక్టర్
మార్కో జన్సెన్ను వేలంలో తమ జట్టు సొంతం చేసుకోవడం పట్ల ముంబయి ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ హర్షం వ్యక్తం చేశాడు. "మాకు అంతర్జాతీయ ప్రతిభాన్వేషణ బృందం ఉంది. భారత ప్రతిభాన్వేషణ కార్యక్రమమూ చాన్నాళ్లుగా కొనసాగుతూనే ఉంది. రెండేళ్లుగా మేం అతడిని గమనిస్తున్నాం. వేగంగా బంతులు వేయడమే కాకుండా బాగా స్వింగ్ చేయగలడు. పైగా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగల సమర్థుడు. ఈ ఏడాది జన్‌సెన్ పాకిస్థాన్ పర్యటనకు ఎంపికయ్యాడు. క్వింటన్ డికాక్‌తో మాట్లాడినప్పుడు మార్కో పూర్తిగా సంసిద్ధమయ్యాడని చెప్పాడు" అని ఆకాశ్ అంబానీ తెలిపారు.
ఇదీ చూడండి: కేకేఆర్‌కు ప్రధాన సమస్య అదే!: గంభీర్