IPL Umpire Salary Per Match 2023 : ప్రపంచలో అత్యంత రిచ్ క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఈ టోర్నీలో ఆడాలని ప్రతిప్లేయర్ ఆశపడతాడు. ఈ లీగ్‌లో ఆడితే ఫేమ్‌తో పాటు డబ్బులు కూడా భారీగానే సంపాదించొచ్చు. ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు రూ. లక్షలు, కోట్లు పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి. ఇదే కాకుండా వారికి ప్రతి మ్యాచ్‌కు ఫీజు ఉంటుంది. ఈ ఐపీఎల్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్లేయర్లు మాత్రమే కాదు.. ఐపీఎల్ అంపైర్లు కూడా గట్టిగానే సంపాదిస్తున్నారు. వారి జీత భత్యాలు ఎంత ఉంటాయో తెలుసుకుందాం.
మ్యాచ్‌లు జరగాలంటే అంపైర్లు అత్యంత కీలకం. మైదానంలో వారి నిర్ణయమే ఫైనల్. ప్రతి బంతిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. బంతి వైడ్ అయినా, నో బాల్ అయినా.. బ్యాటర్ ఫోర్ కొట్టినా, సిక్స్‌ర్ బాదినా వారే నిర్ణయిస్తారు. అలాంటి అంపైర్లు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం.. 'ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్లు'. రెండో రకం 'డెవలపింగ్ అపైర్లు'. ఐపీఎల్లో కీలకమైన మ్యాచ్‌లకు ఎలైట్ ప్యానల్ అంపైర్లను అసైన్ చేస్తారు. ఇక, డెవలపింగ్ అంపైర్లను సాధరణ మ్యాచ్‌లకు అసైన్ చేస్తారు. ఎందుకంటే వారు ఇంకా నేర్చుకునే స్టేజ్‌లోనే ఉంటారు కాబట్టి. అంపైరింగ్‌లో అనుభవం గడించాక వీరిని ఎలైట్ ప్యానల్‌కు ప్రమోట్ చేస్తారు.
అంపైర్ల జీతాలివే..
ఎలైట్ ప్యానల్ ఉండే అంపైర్లకు ప్రతి మ్యాచ్‌కు రూ. 1.98 లక్షల బేస్ శాలరీ ఉంటుంది. గత సీజన్లో ఈ అమౌంట్ రూ. 1.75 లక్షలుగా ఉండేది. ఇదే కాకుండా బస, రవాణా ఖర్చుల కోసం ప్రతి మ్యాచ్‌కు అంపైర్లకు రోజువారీ స్టైఫండ్ రూ. 12,000 చెల్లిస్తారు. ఇలా ఐపీఎల్ మొత్తం మ్యాచ్‌లకు పని చేస్తే.. ప్రతి ఏటా దాదాపు రూ.40 లక్షల దాకా సంపాదిస్తారు అంపైర్లు. డెవలపింగ్ అంపైర్ల విషయానికొస్తే.. గతేడాది రూ. 40,000గా ఉన్న వీరి మ్యాచ్ ఫీజు.. ఈ సీజన్లో రూ. 59,000కు చేరింది. ఈ ఆంపేర్లు ఐపీఎల్‌లోని ప్రతి మ్యాచ్‌కు అవసరమవరు. కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే వీరు అంపైరింగ్ చేస్తారు. ఎలైట్ ప్యానల్ అంపైర్లలా.. డెవలపింగ్ అంపైర్లకు రోజువారీ స్టైఫండ్ రాదు.
స్పాన్సర్‌షిప్‌తో మరిన్ని డబ్బులు...
ఈ జీతంతో పాటు వివిధ కంపెనీల నుంచి వచ్చిన స్పాన్సర్‌షిప్‌ల వల్ల కూడా ఐపీఎల్ అంపైర్లకు మరిన్ని డబ్బులు వస్తాయి. ఐపీఎల్ 14వ సీజన్లో అఫీషియల్ అంపైర్ స్పాన్సర్‌గా పేటీఎం వ్యవహిరించింది. లీగ్ ముగిశాక.. అంపైర్లందరికీ రూ.7.33 లక్షల చొప్పున స్పాన్సర్షిప్ చెక్‌ను అందజేసింది. అంతకుముందు సీజన్లో మ్యాచ్‌కు రూ.5000 స్పాన్స్ర్షిప్ ఇచ్చేవారు.