లఖ్‌నవూ ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై లఖ్‌నవూ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 14 మ్యాచుల్లో తొమ్మిది విజయాలతో లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 210/0 స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఎనిమిది వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (50), రింకు సింగ్ (40), నితీశ్ రాణా (42), సామ్ బిల్లింగ్స్ (36), సునిల్ నరైన్ (21*) ధాటిగా ఆడినా విజయం సాధించలేకపోయింది. లఖ్‌నవూ బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్ 3, మార్కస్ స్టొయినిస్ 3.. కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో కోల్‌కతా ఇంటిముఖం పట్టింది.
ఛేదనలో ధాటిగానే ఆడింది కోల్‌కతా. తొలి ఓవర్లోనే కోల్‌కతా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. నితీశ్ రానా మాత్రం చెలరేగాడు. తొమ్మిది ఫోర్లు బాది 22 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. అనంతరం వచ్చిన శ్రేయస్ అయ్యర్ సైతం వేగంగా ఆడి అర్ధశతకం చేశాడు. 14వ ఓవర్లో స్టోయినిస్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అయితే, 13వ ఓవర్ నుంచి మ్యాచ్ కోల్‌కతా చేతిలో నుంచి జారిపోయింది. మోహ్‌సిన్ వేసిన ఆ ఓవర్లో రెండే పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్లో ఐదు పరుగులే చేసిన కోల్‌కతా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్‌ను కోల్పోయింది. 15 ఓవర్లో రెండే పరుగులు వచ్చాయి. శ్రేయస్ ఔట్ అయిన తర్వాత వచ్చిన రసెల్ ఇబ్బంది పడ్డాడు. 11 బంతుల్లో ఆరు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. 16వ ఓవర్లో ఓ సిక్స్ బాదిన సామ్ బిల్లింగ్స్.. ఆ తర్వాతి బంతికి ముందుకొచ్చి భారీ షాట్‌కు యత్నించాడు. ఈ క్రమంలోనే స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రింకూ సింగ్, సునీల్ నరైన్ మెరుపులు మ్యాచ్ గెలిపించేందుకు ఉపయోగపడలేదు.
అంతకుముందు, టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (70 బంతుల్లో 140 నాటౌట్: 10 ఫోర్లు, 10 సిక్సర్లు ) శతకంతో చెలరేగాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 68 నాటౌట్: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మూడు క్యాచ్‌లను వదిలేయడం కూడా లఖ్‌నవూకు కలిసొచ్చింది. వికెట్లను తీయడంలో కోల్‌కతా బౌలర్లు తేలిపోయారు. సీజన్ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.
ఈ మ్యాచ్‌తో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్లో 500పరుగులను సాధించిన రాహుల్.. వరుసగా ఐదు సీజన్లలో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ఇదివరకు డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో ఉన్నాడు. ఈ దిల్లీ బ్యాటర్ వరుసగా ఆరు సీజన్లలో 500కు పైగా పరుగులు చేశాడు.