ఇప్పుడు గల్లీ క్రికెట్ అంటే బ్యాట్ ఒక్కటి పట్టుకొని క్రీజులోకి వెళ్లి ఆడొచ్చు. అదే ప్రొఫెషనల్ క్రికెట్లో అలా కుదరదు. బ్యాట్‌తో పాటు ప్యాడ్, గ్లౌజ్, హెల్మెట్ అంటూ ఇలా కొన్ని ఉంటాయి. అవన్ని శరీరానికి తొడుగుకుని క్రీజులోకి వెళ్లి సెట్ అవ్వడానికి కాస్త టైమ్ పడుతుంది. అయితే అవన్నీ వేసుకునేందుకు పట్టే సమయమంతా కూడా క్రీజులో ఉండలేకపోతే.. అంతకన్నా బాధ ఆ బ్యాటర్‌కు మరొకటి ఉండదు. ప్రస్తుతం అలాంటి బాధనే ఎదుర్కొంటున్నాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.
ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన పేలవ ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. 'శూన్య కుమార్'లా మైదానంలో కనపడుతున్నాడు. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతడికిది నాలుగో గోల్డెన్ డక్.
ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ సూర్య గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ సిరీస్‌లోని మూడు మ్యాచుల్లో మూడు సార్లు మొదటి బంతికే ఔట్ అయి సున్నా పరుగులతో క్రీజును వీడాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్లో తొలి మ్యాచ్‌లో 16 బంతుల్లో 15 పరుగులు చేసిన అతడు రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇప్పుడు ముంబయితో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయి ట్రోల్స్‌కు గురౌతున్నాడు. 'టెస్టుల్లో ఛాన్స్ ఇస్తే ఫెయిల్ అయ్యాడు. వన్డేల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇప్పుడు టీ20ల్లోనూ విఫలమవుతున్నాడు.' అని కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది టీ20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. ఈ ఏడాది ఇలాంటి దారుణమైన ఆట ఆడుతాడని ఏ క్రికెట్ అభిమాని కలలో కూడా ఊహించి ఉండరు. దీంతో సూర్య ఆటతీరును కొందరు విమర్శిస్తుంటే.. మరికొంతమంది అభిమానులు బాధపడుతున్నారు. త్వరగా అతడు ఫామ్‌లోకి రావాలని ఆశిస్తున్నారు.
సూర్యకు గాయం.. ఇకపోతే తాజాగా జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ గాయపడ్డాడు. కాస్త గట్టిగానే దెబ్బ తగిలింది. దిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బాదిన సిక్సర్ సూర్యకు తగిలింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ జాసన్ బెహండార్ఫ్ వేయగా.. ఆ ఓవర్లోని మూడో బంతిని లాంగాన్ దిశగా సిక్సర్ బాదాడు అక్షర్. నాలుగో బాల్‌ను కూడా లాంగాన్ దిశగా భారీ షాట్ బాదాడు. అయితే ఈ బంతిని.. సూర్య క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అది కాస్త అతడి కుడి కంటి పైభాగాన్ని తాకింది. వెంటనే ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించాడు. గాయానికి కుట్లు పడే ఉండొచ్చు. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించి.. ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరులో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
ఇదీ చూడండి: IPL 2023 : రోహిత్ మెరుపు ఇన్నింగ్స్.. నోకియా సూపర్ బౌలింగ్.. హై ఓల్టేజ్ మ్యాచ్ ఫొటోస్