భారత బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడకపోవడమే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రధాన సమస్యగా మారిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయట్లేదని అన్నాడు. దీంతో ఇయాన్ మోర్గాన్, రసెల్‌పై భారం పెరుగతుందన్నాడు. దినేశ్ కార్తిక్ గొప్ప ప్రదర్శనలు చేయాలని సూచించాడు.
"భారత ఆటగాళ్ల బ్యాటింగ్ కోల్‌కతాకు ప్రధాన సమస్య ఉంది. గిల్, రాణా మినహా ఎవరూ తీవ్రత చూపట్లేదు. దినేశ్ కార్తిక్ గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడట్లేదు. గత సీజన్‌లో అతడు పేలవ ప్రదర్శన చేశాడు. అందుకే ఆ జట్టు మోర్గాన్, రసెల్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే వాళ్లు పోటీలో నిలవాలంటే రసెల్ ధాటిగా ఆడాల్సి ఉంది. పేపర్‌పై ఆ జట్టు ఎంతో బలంగా ఉన్నప్పటికీ నిలకడగా ఆడలేకపోతోంది."
- గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
"మిడిలార్డర్‌లో కేదార్ జాదవ్‌లాంటి భారత బ్యాట్స్‌మన్ ఉంటే ఆ జట్టుకు మేలుగా ఉంటుంది. అందుకే అనుభవజ్ఞుడు కరుణ్ నాయర్‌ను వేలంలో తీసుకున్నారు. కానీ కేదార్ మిడిలార్డర్‌లో వేగంగా పరుగులు సాధిస్తాడు. ప్రస్తుతం కోల్‌కతాకు రాహుల్ త్రిపాఠి, కరుణ్ ఉన్నారు. కానీ కరుణ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తాడు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తే వాళ్ల బ్యాటింగ్ లైనప్‌లో సమస్యలు తలెత్తుతాయనిపిస్తోంది. మరో ప్రశ్న ఏంటంటే ఓపెనర్లుగా బరిలోకి దిగేదెవరు? గిల్‌తో మరోసారి నరైన్‌ను పంపిస్తారా?" అని గంభీర్ అన్నాడు.
గురువారం జరిగిన వేలంలో కోల్‌కతా కరుణ్ నాయర్‌ను రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. అతడితో పాటు షకీబ్ అల్ హసన్ (రూ.3.2 కోట్లు), హర్భజన్ (రూ.2 కోట్లు), బెన్ కటింగ్ (రూ.75 లక్షలు), పవన్ నేగి (రూ.50 లక్షలు), వెంకటేశ్ అయ్యర్ (రూ.20 లక్షలు), షెల్డన్ జాక్సన్ (రూ.20 లక్షలు), వైభవ్ అరోరా (రూ.20 లక్షలు)ను దక్కించుకుంది.
ఇదీ చూడండి: కృష్ణప్పను పార్టీ అడిగిన రోహిత్, హార్దిక్