David Warner: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లోనే 42 పరుగులు చేసి దిల్లీ క్యాపిటల్స్ విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ క్రమంలో అతడు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో రెండు జట్లపై (పంజాబ్, కేకేఆర్) వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్‌పై వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా, కోల్‌కతాపై వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా వార్నర్ కొనసాగుతున్నాడు.
తొలి విదేశీ స్పిన్నర్‌గా నరైన్ రికార్డు: దిల్లీతో మ్యాచ్‌లోనే ఓ రికార్డును సాధించాడు కోల్‌కతా ఆల్‌రౌండర్ సునీల్ నరైన్. ఈ మ్యాచ్‌లో తీసిన ఏకైక వికెట్‌తో ఐపీఎల్ చరిత్రలో 150 వికెట్లు తీసిన తొలి విదేశీ స్పిన్నర్‌గా ఘనత దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో డ్వేన్ బ్రావో (181), లసిత్ మలింగ (170), అమిత్ మిశ్రా (166) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది కోల్‌కతా. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం దిల్లీ ఆరు వికెట్లను కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ వార్నర్ (42), లలిత్ యాదవ్ (22), రోవ్‌మన్ పావెల్ (33*), అక్షర్ పటేల్ (24) రాణించారు.
ఇదీ చూడండి: 'సన్‌రైజర్స్‌లో కరవైంది దిల్లీలో.. అందుకే వార్నర్ రెచ్చిపోతున్నాడు'