IPL 2022: హైదరాబాద్ వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్ టాప్‌ఆర్డర్‌లోని పలువురి ఆటగాళ్లు టెస్టు ఆటను తలపించారు. కోల్‌కతా నిర్దేశించిన 178 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (43), మార్‌క్రమ్ (32) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో హైదరాబాద్ 130 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 9), రాహుల్ త్రిపాఠి (12 బంతుల్లో 9), నికోలస్ పూరన్ (3 బంతుల్లో 2), వాషింగ్టన్ సుందర్ (9 బంతుల్లో 3), శశాంక్ సింగ్ (12 బంతుల్లో 11), మార్కో జాన్‌సెన్ (2 బంతుల్లో 1) ఘోరంగా విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 3, టిమ్ సౌథీ 2.. ఉమేశ్, వరుణ్, సునిల్ తలో వికెట్ తీశారు.
దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. హైదరాబాద్‌పై ఘన విజయం సాధించిన కోల్‌కతా సాంకేతికంగా ఛాన్స్‌లను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం 12 మ్యాచుల్లో హైదరాబాద్ ఐదు విజయాలతో 10 పాయింట్లను మాత్రమే సాధించింది. ఇక కోల్‌కతా 13 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి ఆరో స్థానానికి చేరుకుంది. ఈ ఓటమితో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్‌కు 178 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ఆండ్రూ రస్సెల్ (49*), సామ్ బిల్లింగ్స్ (34), అజింక్య రహానె (28), నితీశ్ రాణా (26) రాణించారు. వాషింగ్టన్ సుందర్ వేసిన చివరి ఓవర్‌లో రస్సెల్ మూడు సిక్సర్లు బాదాడు. వెంకటేశ్ అయ్యర్ 7, శ్రేయస్ అయ్యర్ 15, రింకు సింగ్ 5 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3.. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్‌సెన్, నటరాజన్ తలో వికెట్ తీశారు.
ఇదీ చదవండి: IPL 2022: ఆర్సీబీకి ప్లేఆఫ్స్ బెర్తు కష్టమేనా?