IPL 2022 Rohit Sharma: ఐపీఎల్ 2022 సీజన్ ముంబయిలో నిర్వహించడం వల్ల తమకు వచ్చే ప్రయోజనం ఏం లేదని ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టులో 80 శాతం కొత్తవాళ్లేనని, పైగా గత రెండేళ్లుగా ముంబయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని హిట్‌మ్యాన్ గుర్తు చేశాడు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోచ్ మహేల జయవర్దనే కలిసి రోహిత్ వర్చువల్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ముంబయిలో మ్యాచ్‌లు జరగడం రోహిత్‌సేనకు కలిసి వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
Surya Kumar Yadav: ఈ నెల 27న జరిగే ముంబయి- దిల్లీ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆడడం లేదనే వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన హిట్‌మ్యాన్.. "ఫిట్నెస్ సమస్యతో సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో(ఎన్‌సీఏ) ఉన్నాడు. అతడి రాక కోసం ఎదురు చూస్తున్నాం. ఎన్‌సీఏ నుంచి క్లియరెన్స్ రాగానే అతడు జట్టుతో కలుస్తాడు." అని అన్నాడు. కాగా, తాను ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగుతానని పేర్కొన్నాడు.
ఆ నిబంధనలు చాలా మంచివి(Two DRS In IPL): 'రెండు రివ్యూలు ఉండే నిబంధన చాలా మంచిది. ఎందుకంటే ఆటలో అప్పుడప్పుడు కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. వాటిని సరిచేసుకునే అవకాశం దక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రెండు రివ్యూలు ఉన్నాయి. కాబట్టి ఐపీఎల్‌లో కూడా ఈ నిబంధన ఉండాల్సిందే. ఇది చాలా మంచి నిర్ణయం అనేది నా అభిప్రాయం' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ప్రత్యర్థులకు మంచి అవకాశం(Mankading As Runout): క్రికెట్ నియమ నిబంధనలు నిర్ణయించే ఎంసీసీ.. మన్కడింగ్‌ను రనౌట్ కేటగిరీకి ఇటీవలే మార్చింది. దీనిపై హిట్‌మ్యాన్ మాట్లడుతూ.. "ఇది మంచి రూల్. ఈ నిర్ణయం వల్ల బ్యాటర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. " అని రోహిత్ అన్నాడు. కాగా, ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26న ప్రారంభమై.. మే 29న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఈసారి లఖ్‌నవూ, గుజరాత్ జట్ల రాకతో పది జట్లు కప్పుకోసం పోటీ పడుతున్నాయి. 65 రోజుల పాటు సాగే సీజన్లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 27న బ్రబౌర్న్ స్టేడియంలో ముంబయి జట్టు తన మొదటి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
ఇదీ చదవండి: 'పాంటింగ్ కోచింగ్‌లో పంత్ మరింత రాటుదేలుతాడు'