IPL 2022 Deepak Chahar: డిఫెండింగ్ ఛాంపియన్.. నాలుగు సార్లు ఐపీఎల్ విజేత.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో తన స్థాయికి తగ్గట్లుగా ఆటతీరును కనబర్చడం లేదు. వరుసగా నాలుగు ఓటములను ఎదుర్కొని.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఇదిలా ఉంటే సీఎస్కే జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ప్రధాన పేసర్ దీపక్ చాహర్ వెన్నుముక గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
Chennai Super Kings: ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్ సమయంలో చాహర్‌కు తొడ కండరాల గాయమైంది. నెల రోజులకు పైగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో (ఎన్‌సీఏ) చికిత్స పొందుతున్న చాహర్‌కు వెన్ను గాయమైనట్లు ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి. దీంతో ఏప్రిల్ రెండో వారానికల్లా ఐపీఎల్లో చెన్నై జట్టులో చేరతాడనని భావించిన చాహర్.. సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆటగాళ్ల మెగా వేలంలో రూ.14 కోట్లకు చాహర్‌ను కొనుక్కున్న చెన్నై.. అతడు లేకుండానే ఈ సీజన్‌లో బరిలో దిగింది. పవర్ ప్లేలో వికెట్లు తీయగలిగే చాహర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని స్థానంలో ఫీల్డ్‌లోకి దిగిన బౌలర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోతున్నారు.
Deepak Chahar Emotional Post: ఈ సీజన్ మొత్తానికి చాహర్ దూరమవుతున్నాడని.. సీఎస్కే అధికారికంగా ప్రకటించడానికి కొన్ని గంటల ముందు అతడు ట్విట్టర్లో భావోద్వేగకరమైన పోస్టు పెట్టాడు. "సారీ.. గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమవుతున్నాను. నాకు నిజంగా ఆడాలని ఉంది. మరికొద్ది రోజుల్లో ఎప్పటిలాగే బలంగా తిరిగి వస్తాను. మీరంతా నాపై అపారమైన ప్రేమ చూపిస్తూ.. ఎల్లప్పుడూ నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ఆశీస్సులు నాకు ఇప్పుడు అవసరం" అని చాహర్ రాసుకొచ్చాడు.
Kolkata Night Riders: మరోవైపు, ఐపీఎల్ 2022 సీజన్‌కు గాయంతో దూరమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ రసిఖ్ సలామ్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. "ఈ సీజన్‌లో కోల్‌కతా తరఫున రెండు మ్యాచులు ఆడిన సలామ్.. వెన్నుముక గాయం కారణంగా లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో హర్షిత్ రాణా జట్టులోకి చేరతాడు" అని కోల్‌కతా ఫ్రాంఛైజీ తెలిపింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో కేకేఆర్ జట్టు మూడు మ్యాచుల్లో గెలిచి, మరో మూడింట ఓడింది.
ఇవీ చదవండి: IPL 2022: అరంగేట్రంలోనే ఈ యువఆటగాళ్లు అదుర్స్..