ఐపీఎల్-2020లో అబుదాబి వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేను చిత్తు చేసింది ముంబయి ఇండియన్స్. ఈ సందర్భంగా జట్టు విజయంపై హర్షం వ్యక్తం చేశాడు కెప్టెన్ కీరన్ పొలార్డ్. సీఎస్కేను వంద పరుగులు కూడా చేయనీయకూడదని భావించినట్లు పేర్కొన్నాడు. కానీ సామ్ కరన్ బాగా ఆడాడని కొనియాడాడు.
"నాయకత్వం వహించడానికి నాయకుడే అవ్వాల్సిన పనిలేదు. జట్టు విజయం కోసం సాధ్యమైనంత వరకు బాగా ఆడడానికే ప్రయత్నించాలి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టా. తక్కువ పరుగులకే ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాం. ఛేదనలో వికెట్ పడకుండా ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేదించడం హర్షనీయం. ప్రతి ఆటలో ఎంత మెరుగవుతున్నామనేది చాలా ముఖ్యం".
-కీరన్ పొలార్డ్, ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్.
గాయపడ్డ రోహిత్ శర్మ స్థానంలో ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌కు సారథ్యం వహించాడు పొలార్డ్. ముంబయి బౌలర్ల ధాటికి 114 పరుగులే చేయగలిగింది చెన్నై జట్టు. ఆ తర్వాత బరిలో దిగిన ముంబయి వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.