వైడ్, ఫుల్‌టాస్ నోబాల్ విషయంలో సమీక్ష కోరే అవకాశం కెప్టెన్లకు ఉండాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి కోహ్లీ అభిప్రాయపడ్డాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా చెన్నై కెప్టెన్ ధోనీ, అంపైర్ వైడ్ ఇవ్వబోతుండగా అభ్యంతరం వ్యక్తం చేయడం, వెంటనే అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపించడం వల్ల దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కోహ్లీ స్పందించాడు.
"నేను ఒక కెప్టెన్‌గా మాట్లాడుతున్నా. వైడ్ విషయంలో అనుమానం ఉన్నపుడు సమీక్ష కోరే అవకాశం కెప్టెన్‌కు ఉండాలంటాను. అలాగే బ్యాట్స్‌మన్ నడుం మీదికి ఫుల్‌టాస్ వేసినపుడు నోబాల్ ఇచ్చేటపుడూ సమీక్షకు అవకాశముండాలి. కొన్నిసార్లు ఈ నిర్ణయాల్లో తప్పులు ఉంటాయి. ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల్లో ఇలాంటి నిర్ణయాలు కొన్నిసార్లు కీలకమవుతుంటాయి. కొన్నిసార్లు ఒక్క పరుగు తేడాతో కూడా ఓడిపోయే పరిస్థితులుంటాయి. కాబట్టి వైడ్‌ను తప్పుగా ఇచ్చినపుడు సమీక్ష కోరలేకపోతే ఒక జట్టు చాలా నష్టపోవచ్చు" అని కోహ్లీ అన్నాడు.