సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన దిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్ తగిలింది! ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. నిర్దేశిత సమయం కన్నా ఎక్కువగా బౌలింగ్ చేయడం వల్ల ఈ చర్యలు తీసుకున్నామని లీగ్ నిర్వాహకులు తెలిపారు.
అబుదాబి వేదికగా మంగళవారం హైదరాబాద్, దిల్లీ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వార్నర్ సేన 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ వార్నర్ (45), బెయిర్ స్టో (53), విలియమ్సన్ (41) బాగానే పరుగులు చేశారు. ప్రధాన బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోవడం వల్ల వికెట్లు తీసేందుకు దిల్లీ బౌలర్లు శ్రమించారు.
వికెట్లు పడగొట్టేందుకు దిల్లీ సారథి శ్రేయస్ బౌలింగ్‌లో పలు మార్పులు చేశాడు. ఆటగాళ్లతో చర్చించాడు. ఈ క్రమంలో ఆ జట్టు నిర్దేశించిన సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. ఇది లీగ్ నియమావాళిని ఉల్లంఘించినట్టే అవుతుంది. ఆలస్యమైన ఓవర్లను బట్టి శ్రేయస్‌కు రూ.12 లక్షలు జరిమానా విధించారు.