యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ప్రారంభవారంలో దాదాపు 269 మిలియన్ల మంది టోర్నీని వీక్షించారు. గతేడాదితో పోలిస్తే ఒక్కో మ్యాచ్‌కు 11 మిలియన్ల మంది ప్రేక్షకులు పెరిగారు. వీక్షకులతో పాటు 15 శాతం ప్రకటనలూ పెరిగాయని ఓ నివేదిక పేర్కొంది.
ఓ అధ్యయనం ప్రకారం.. 2019తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో ఒక్క మ్యాచ్ సగటున చూసే వారిలో 21 శాతం ప్రేక్షకులు పెరిగారు. ప్రతి ముగ్గురు టెలివిజన్ ప్రేక్షకులలో ఒకరు ఐపీఎల్‌ను చూస్తున్నారని.. 44 శాతం మంది టెలివిజన్ చూసే కుటుంబాలు టోర్నీని చూస్తున్నారని తెలుస్తోంది. ప్రకటనల విలువలో కూడా మొదటి ఆరు మ్యాచ్‌ల తర్వాత 15 శాతం పెరుగుదల కనిపించింది.
ఓటీటీలోనూ వీక్షకుల సంఖ్య 32 శాతం పెరుగుదల కనిపించింది. ఐపీఎల్ ప్రారంభమైన వారంలో స్పోర్ట్స్ యాప్స్, ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌ల గురించి అంతర్జాలంలో వెతికే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రస్తుత ఐపీఎల్లో ఆరంభ మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరగ్గా.. ఆ మ్యాచ్‌ను 52 మిలియన్ల మంది వీక్షించారు. అంటే గతేడాదితో పోలిస్తే 29 శాతం ఎక్కువ. టోర్నీలోని రెండు నుంచి ఏడో మ్యాచ్ వరకు 34 మిలియన్ల మంది ప్రేక్షకులను పెంచుకుంటూ పోతూ.. దాదాపు వంద మిలియన్ల వీక్షణలు లభించాయి. అందులో 15 నుంచి 21 మధ్య వయసుగల వారే ఎక్కువగా ఉన్నారు.