ఫిరోజ్‌షా వేదికగా జరిగిన దిల్లీ- కోల్‌కతా మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. కోల్‌కతా నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 20 ఓవర్లకు 185 పరుగులే దిల్లీ చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్లో రబాడా అద్భుత బౌలింగ్‌తో దిల్లీ విజయం సాధించింది.
దిల్లీలో మెరిసిన ముంబయి కుర్రాడు
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది దిల్లీ క్యాపిటల్స్. ఇన్నింగ్స్ ప్రారంభించినమూడో ఓవర్లోనే ధావన్ వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ పృథ్వీషాతో కలిసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. రెండో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 43 పరుగులు చేసి శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు.
ఎడాపెడా బాదిన షా..
దిల్లీ యువ ఓపెనర్ ఫృథ్వీషా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్ ఎవరని చూడకుండా ఎడాపెడా షాట్లతో రెచ్చిపోయాడు. కవర్ డ్రైవ్లతోక్రికెట్ దిగ్గజం సచిన్‌ను తలపించాడు. ఒక్క పరుగు దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. 55 బంతుల్లో 99 పరుగులు చేసి వెనుదిరిగాడు.
పట్టు బిగించిన కోల్‌కతా...
ఫృథ్వీషా ఔట్ అయిన అనంతరం కోల్‌కతా బౌలర్లు పట్టు బిగించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా చైనామన్ బౌలర్ కుల్దీప్ 5 పరుగులే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఐపీఎల్లో ఇదే మొదటి సూపర్ ఓవర్ మ్యాచ్.
'సూపర్' ఓవర్...
సూపర్ ఓవర్లో ముందుగా దిల్లీ బ్యాటింగ్ చేసింది. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చారు. కృష్టా వేసిన ఈ ఓవర్లో అయ్యర్ ఓ ఫోర్ కొట్టి వెనుదిరిగాడు. మొత్తానికి దిల్లీ 10 పరుగులు చేసింది.
రసెల్ బౌల్డ్...
11 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా కోల్‌కతా ఛేదిస్తుందనుకున్నారు అభిమానులు. అయితే రబాడా బౌలింగ్‌కు వచ్చాడు. దినేశ్ కార్తీక్, రసెల్ ఓపెనర్లుగా దిగారు. మొదటి బంతినే ఫోర్‌గా మలిచాడు రసెల్. తర్వాత ఓ డాట్ బాల్ ఆడాడు.
అయితే అద్భుత యార్కర్‌తో రసెల్‌ను బౌల్డ్ చేశాడు రబాడా. అభిమానుల అరుపులతో స్టేడియం హోరెత్తింది. మిగిలిన మూడు బంతులకు 3 పరుగులే వచ్చాయి. దీంతో దిల్లీ కుర్రాళ్లు విజయం సాధించారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఫృథ్వీషా నిలిచాడు.