ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే రికార్డును సమం చేశాడు. భారత్- ఇంగ్లండ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీని గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు.
కుంబ్లే రికార్డు సమం..
ప్రస్తుతం 163వ టెస్టు ఆడుతున్న అండర్సన్.. 619 వికెట్లు తీశాడు. భారత దిగ్గజ స్పిన్నర్ కుంబ్లే కూడా అన్నే వికెట్లు దక్కించుకున్నాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. ఇతడిదే అగ్రస్థానం. ఆసీస్ మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్.. టెస్టు కెరీర్లో 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
2003లో టెస్టు అరంగేట్రం చేసిన అండర్సన్ పేసర్లలో మాత్రం విజయవంతమైన క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.
58 పరుగుల దూరంలో..
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు.. 183 పరుగులకు ఆలౌటైంది. అనంతరం.. బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. వర్షం కారణంగా.. రెండో రోజు పలు మార్లు ఆటకు అంతరాయం కలిగింది. ఓ దశలో 97/0తో పటిష్ఠ స్థితిలో ఉన్న భారత్.. 104/3తో నిలిచింది.
తొలుత రోహిత్‌ను(36) రాబిన్సన్ ఔట్ చేయగా.. ఆ తర్వాత పుజారా(4), కోహ్లీ(0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు అండర్సన్. కాసేపటికే రహానే(5) రనౌటయ్యాడు. క్రీజులో రాహుల్(57), పంత్(7) ఉన్నారు. ఇంగ్లాండ్ స్కోరుకు ఇంకా 58 పరుగుల దూరంలో ఉంది టీమ్ ఇండియా.
కోహ్లీ ఎప్పుడెప్పుడు గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడంటే..
- ఆస్ట్రేలియాపై.. ఎంసీజీ.. 2011/12 (బెన్ హిల్ఫెనాస్)
- ఇంగ్లాండ్‌పై.. లార్డ్స్.. 2014 (లియామ్ ప్లంకెట్)
- ఇంగ్లాండ్‌పై.. ఓవల్.. 2018 (స్టువర్ట్ బ్రాడ్)
- వెస్టిండీస్‌పై కింగ్స్టన్ 2019 (కీమర్ రోచ్)
- ఇంగ్లాండ్‌పై ట్రెంట్ బ్రిడ్జి (జేమ్స్ అండర్సన్)
ఇదీ చదవండి: టెస్ట్ సిరీస్, ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ దూరం