Indian Players Meeting Delhi: రెండు నెలలకు పైగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 15వ సీజన్ ముగిసింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. అనూహ్యంగా టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇక, అంతర్జాతీయ సిరీస్‌లపై దృష్టి సారించింది టీమ్ఇండియా. దక్షిణాఫ్రికాతో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జూన్5న దిల్లీకి చేరుకోనుంది.
జూన్ 9న సౌతాఫ్రికాతో సిరీస్ మొదలుకానుంది. జూన్ 2న సఫారీ జట్టు దిల్లీకి చేరుకుంటుంది. ఈ పర్యటనలో ప్రేక్షకుల సంఖ్యపై ఎలాంటి పరిమితులు కానీ, బయోబబుల్ ఆంక్షలు కానీ లేవు. అయితే సిరీస్ సాంతం ఆటగాళ్లకు క్రమం తప్పకుండా కొవిడ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
India Southafrica T20 Series: జూన్ 9న దిల్లీ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనుంది. అనంతరం 12, 14, 17, 19వ తేదీల్లో వరుసగా కటక్, వైజాగ్, రాజ్‌కోట్, బెంగళూరులో మిగిలిన నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్ ప్లేయర్స్‌కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లతో పాటు దినేశ్ కార్తీక్‌కు జట్టులో చోటిచ్చింది. ఇక, ఈ సిరీస్‌లో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ కాకుండా వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ జరుగుతున్న సమయంలోనే గతేడాది వాయిదా పడ్డ ఐదో టెస్టును ఆడేందుకు టీమ్ఇండియా.. ఇంగ్లండ్‌కు పయనం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే టెస్టు జట్టును కూడా ప్రకటించింది. అయితే ఈ టీమ్‌కు మాత్రం కోచ్‌గా ద్రవిడ్ వ్యవహరించనున్నాడు.
ఇవీ చదవండి: 'అబ్బాయినైతే బాగుండు.. ఆ 'నొప్పి' ఉండేదే కాదు'.. క్రీడాకారిణి భావోద్వేగం
రోహిత్, కోహ్లీ లేకుండా.. సచిన్ ఐపీఎల్ 2022 సీజన్ బెస్ట్ టీమ్!