తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 188 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 404 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లా 150కు కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 258/2 స్కోరుకు డిక్లేర్డ్ చేసింది.
ఐదో రోజు ఆట ప్రారంభమైన 50 నిమిషాల్లోపే బంగ్లాదేశ్ కేవలం 52 పరుగులే చేసి చివరి నాలుగు వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను అక్షర్ పటేల్ (4/77), కుల్‌దీప్ యాదవ్ (3/73) కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. సిరాజ్, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన కుల్‌దీప్ యాదవ్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.