భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. తిరిగి కామెంటరీ బాక్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. భారత్-ఆసీస్ సిరీస్‌తో ఇతడిని ఎంపిక చేసే అవకాశముంది. ఈ మేరకు ఆస్ట్రేలియా బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఇతడితో పాటే గ్లెన్ మెక్‌గ్రాత్, నిక్ వైట్, హర్ష భోగ్లే, అజయ్ జడేజా, మురళీ కార్తిక్, అజిత్ అగర్కార్.. ఈ ప్యానెల్లో ఉండనున్నారు.
గతేడాది ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజాపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ తర్వాత అతడ్ని వ్యాఖ్యాతల ప్యానెల్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ ఈ ఏడాది ప్రారంభంలో ధ్రువీకరించింది. అయితే దానికి గల కారణాలను మాత్రం బోర్డు వెల్లడించలేదు. దీంతో మార్చి నుంచి కామెంటరీకి దూరంగా ఉన్నాడు సంజయ్.
అనంతరం ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభానికి ముందు తనను తిరిగి ప్యానెల్లో చోటు కల్పించాలని బీసీసీఐకి సంజయ్ రెండుసార్లు లేఖ రాశాడు. అయినా అతడ్ని పరిగణలోకి తీసుకోలేదు బోర్డు.
హిందీ ప్యానెల్లో సెహ్వాగ్
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. భారత్-ఆస్ట్రేలియా సిరీస్ కోసం హిందీ వ్యాఖ్యాతల ప్యానెల్లో భాగం కానున్నాడు. జహీర్ ఖాన్ కూడా ఇందులో ఉన్నాడు. వీరితో పాటు విజయ్ దహియా, మహ్మద్ కైఫ్, వివేక్ రజ్దాన్, అర్జున్ పండిట్లు ఉన్నారు.
మూడు వన్డేల సిరీస్‌తో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన ప్రారంభం కానుంది. నవంబరు 27, 29, డిసెంబరు 2 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత డిసెంబరు 4, 6, 8 తేదీల్లో టీ20లు ఆడనున్నారు. డిసెంబరు 17 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.