ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఊహించినట్టే టీమ్ఇండియా ఓపెనర్ పృథ్వీ షా ఔటయ్యాడు. ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్‌గా షా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ ప్రసారమవుతున్న స్పోర్ట్స్ 7 ఛానెల్లో వ్యాఖ్యాతగా చేస్తున్న రికీ పాంటింగ్.. అంతకు ముందే బ్యాట్స్‌మన్ బలహీనతను పసిగట్టాడు. తొలి బంతి తర్వాత ఇన్‌స్వింగ్ డెలివరీలను ఆడడంలో పృథ్వీషాకు ఉన్న బలహీనతను ప్రస్తావించాడు. బ్యాటుకు, ప్యాడ్‌కు మధ్య అతను గ్యాప్ ఇస్తున్నట్లు తెలిపాడు. ఇన్‌స్వింగ్ బంతికి పృథ్వీషా ఔట్ అయ్యే అవకాశం ఉందని పాంటింగ్ చెప్పిన వెంటనే షా ఔట్ కావడం విశేషం.
మిచెల్ స్టార్క్ విసిరిన తొలి ఓవర్ మొదటి బంతిని షా డిఫెండ్ చేశాడు. బ్యాటుకు, ప్యాడుకు మధ్య షా.. గ్యాప్ ఇవ్వడాన్ని గమనించిన పాంటింగ్, ఆస్ట్రేలియా బౌలర్లు అక్కడే గురిపెడతారని వ్యాఖ్యానించాడు. రెండో బంతికి సరిగ్గా అదే జరిగింది.
ఇదీ చూడండి: కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ 233/6