IND Vs NZ Semi Final 2023 Rohit Sharma : స్వదేశంలో జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా ఎదురులేకుండా సెమీస్‌కు చేరింది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న భారత్.. బుధవారం (నవంబర్ 15) ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో తలపడుతోంది. కివీస్‌తో తొలి సెమీ ఫైనల్ నేపథ్యంలో టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ముంబయి వాంఖడే స్టేడియంలో టాస్ గెలవడం ముఖ్యమైన అంశం కాదని చెప్పాడు. దాని గురించి తమకు దిగులు లేదని స్పష్టం చేశాడు. అన్ని విధాలా పటిష్ఠంగా ఉన్న తమ జట్టుకు అదృష్టం తోడుకావాలని ఆకాంక్షించాడు. ధైర్యవంతులకు అదృష్టం అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దాంతో పాటు సెమీఫైనల్ ఉంది కాబట్టి మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు.
"మేము ఇన్ని రోజులుగా చేస్తున్న దానికి భిన్నంగా ఏమీ చాయాల్సిన అవసరం లేదు. భారత క్రికెటర్లుగా తమ ప్రయాణంలో ఒత్తిడి ఎప్పుడూ ఒక భాగమే. సెమీఫైనల్‌కు మైదానంలోకి వస్తున్నప్పుడు దానికి భిన్నంగా ఏమీ ఉండదు. అది లీగ్ మ్యాచ్ అయినా, సెమీఫైనల్ అయినా, ప్రపంచకప్ మ్యాచ్ అయినా సరే.. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. మొదటి గేమ్ నుంచి చివరి గేమ్ వరకు మేము ఒత్తిడిని హ్యాండిల్ చేశాము. జట్టు బాగా స్పందించింది. మేము రాబోయే రెండు మ్యాచ్‌లలో మంచి క్రికెట్ ఆడటంపై దృష్టి పెడుతున్నాము. ప్రత్యర్థి నుంచి వచ్చే ఒత్తిడి, సవాళ్లపై కాకుండా.. మేము ఆటపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది"
--రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్
న్యూజిలాండ్ జట్టుపై తనకు గౌరవం ఉందని రోహిత్ చెప్పాడు. కివీస్‌ను అత్యంత క్రమశిక్షణ కలిగిన జట్టుగా అభివర్ణించాడు. వారు ప్రత్యర్థిని బాగా అర్థం చేసుకుంటారని.. ఐసీసీ టోర్నమెంట్‌ల్లో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల్లో నిలకడగా ఆడతారని చెప్పాడు. 'భారత్ మొదటి సారి వరల్డ్ కప్ గెలిచినప్పుడు.. జట్టులో ఇప్పుడున్న సగం మంది ప్లేయర్లు పుట్టలేదు. ఇక చివరకగా టీమ్ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు.. ఈ జట్టులో సగం మంది క్రికెట్ ఆడలేదు. మొదటి లేదా చివరి ప్రపంచ కప్‌లో తాము ఎలా గెలిచాము అనే దాని గురించి వారు మాట్లాడటం నేను చూడలేదు. ఎలా మెరుగవ్వాలి, దాని కోసం మనం ఏం చేయగలం అనే దానిపై వారి దృష్టి ఉంది. ప్రస్తుతం ఏం జరుగుతోంది అనేపైనే ఎల్లప్పుడూ దృష్టి ఉంటుంది" అని రోహిత్ చెప్పాడు వివరించాడు.
ఐశ్వర్య రాయ్‌పై పాక్ మాజీ క్రికెటర్ అనుచిత వ్యాఖ్యలు- నెటిజెన్స్ ఫైర్!
'రోహిత్‌కు ఇదే లాస్ట్ వరల్డ్‌కప్- విరాట్ ఆ రికార్డు బ్రేక్ చేయడం ఖాయం!'