Rohit sharma boult: టీమ్‌ఇండియా కొత్త సారథి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ రాణిస్తుందని ముంబయి ఇండియన్స్ మాజీ ఆటగాడు, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అభిప్రాయపడ్డాడు. అతని కెప్టెన్సీలో ఆడటాన్ని ఆస్వాదించానని పేర్కొన్నాడు. రోప్‌ల దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రోహిత్‌ను గమనించానని, అతని గురించి చాలా అర్థం చేసుకున్నానని బౌల్ట్ వివరించాడు.
బౌల్ట్ 2020 నుంచి 2021 ఐపీఎల్ సీజన్ వరకు ముంబయి ఇండియన్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. రోహిత్ శర్మ ఈ మధ్యే టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. టెస్టుల్లోనూ ఉప సారథిగా ఎంపికయ్యాడు. ముంబయి ఇండియన్స్ సారథిగా ఉన్న రోహిత్ శర్మ.. ఆ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు.
'రోహిత్ చాలా అనుభవం ఉన్న ఆటగాడు. అతడు భారత జట్టును ఏ విధంగా ముందుకు నడిపిస్తాడా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముంబయి ఇండియన్స్ తరపున అతని కెప్టెన్సీలో ఆడటాన్ని ఆస్వాదించా. నేను బౌండరీ వద్ద నిలబడి అతడి కెప్టెన్సీని, వ్యూహాలను గమనించాను. భారతదేశానికి రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన ఆటగాడు. అతని నాయకత్వంలో జట్టు బాగా రాణిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా చాలా విజయవంతమయ్యాడు. సారథిగా అక్కడ చాలా ఒత్తిడి ఉంటుంది. పేస్ బౌలర్‌గా నేను దాన్ని అర్థం చేసుకోగలను. కానీ, కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ ఒత్తిడిని చాలా చక్కగా ఎదుర్కొంటాడు. తన ఐపీఎల్ అనుభవాన్ని భారత జట్టు ప్రయోజనాల కోసం కచ్చితంగా ఉపయోగిస్తాడని భావిస్తున్నా. అతడు నాయకత్వం వహిస్తుంటే చూడటం ఆసక్తికరంగా ఉంటుంది' అని బౌల్ట్ పేర్కొన్నాడు.
కోహ్లీ కెప్టెన్సీ గురించి చెప్పలేను
విరాట్ కోహ్లి కెప్టెన్సీ, రోహిత్ కెప్టెన్సీ ఒకే విధంగా ఉందా? ఏమైనా తేడాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా.. 'నేను చాలా కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే నేను కోహ్లీ నాయకత్వంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ, అతడు టీమ్‌ఇండియాకు చాలా శక్తిమంతమైన ఆటగాడు, కెప్టెన్' అని బౌల్ట్ సమాధానమిచ్చాడు.
ఇవీ చదవండి: