ICC World Cup 2023 Highest Run Scorer : ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ దగ్గరపడుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ఇంకా జాక్వెస్ కలిస్ ఏమన్నాడంటే?
కాగా.. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వరల్డ్‌కప్ జరగనుంది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెమీస్ చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రొటిస్ లెజెండ్ జాక్వెస్ కలిస్ వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక పరుగుల వీరుడిగా ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ జోస్ బట్లర్ నిలుస్తాడని అంచనా వేశాడు.' భారత పిచ్‌లపై జోస్ బట్లర్ మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నా. ఇంగ్లాండ్ జట్టు కూడా ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం నాకు ఉంది.' అని కలిస్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు.
ఇంగ్లాండ్ బ్యాటర్ ఇయాన్ మోర్గాన్ నుంచి జోస్ బట్లర్ గతేడాది వన్డే కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. ఇప్పటివరకు బట్లర్ 165 వన్డేల్లో 41.49 సగటుతో 4,647 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే.. భారత్‌లో మాత్రం బట్లర్ వన్డే రికార్డు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు భారత గడ్డపై 8 వన్డే మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. కేవలం 83 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 31 మాత్రమే. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో జోస్ బట్లర్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జాక్వెస్ కలిస్ అంచనా వేయడం గమనార్హం.
వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా బట్లర్ నిలుస్తాడని కలిస్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి వన్డేల్లో అద్భుత రికార్డులు కలిగి ఉన్న టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను బట్లర్ వెనక్కి నెట్టగలడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరో 3 నెలలు వేచి చూడాల్సిందేని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Asia cup 2023 ind vs pak venue : ఆసియా కప్ షెడ్యూల్ రెడీ.. భారత్-పాక్ మ్యాచ్ వేదిక ఇదే!